అమ్మాయి పుట్టిల్లు వదులుతున్నట్లు.. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి

Posted By: Super

అమ్మాయి పుట్టిల్లు వదులుతున్నట్లు.. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి

బెంగళూరు: తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లిచేసి పుట్టింటి నుంచి పంపినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రస్తుతం తాను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నానని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. కంపెనీకి త్వరలో గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో వాటాదార్లకు రాసిన ఆఖరి లేఖలో ఆయన తన భావోద్వేగాన్ని ఇలా వ్యక్తం చేశారు. ‘వీడ్కోలు మిత్రులారా.. విలువలతో ముందుకు సాగండి’ అనే శీర్షికతో ఈ లేఖ రాశారు. ఇన్ఫోసిస్ తన జీవితంలో ఎంత విడదీయలేని భాగమైపోయినదీ వివరిస్తూ.. తాను అన్నింటి కన్నా ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించినప్పటికీ, కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆ భావన కల్పించలేకపోయానని నారాయణ మూర్తి వెల్లడించారు.

ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని తాను ఆసాంతం ఆస్వాదించానన్నారు. ‘కంపెనీ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయంలోనూ నేను నంబర్ వన్ పాత్ర పోషించాను. ప్రతి మైలురాయిని అధిగమించడాన్ని ఆస్వాదించాను. కంపెనీ తప్పటడుగు వేసిన ప్రతిసారి ఎంతగానో బాధపడ్డాను’ అని నారాయణ మూర్తి వెల్లడించారు. తన ప్రమేయం ఎక్కువగా ఉండని, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ..అవసరమైతే సహాయం అందించేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ‘కూతురు కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. పెళ్లి తర్వాత అమ్మాయిని సాగనంపినప్పటికీ, ఆమెకు ఎప్పుడవసరమైనా వారు అండగా ఉంటారు’ అని తన తోడ్పాటుపై భరోసా ఇచ్చారు. ఆగస్టు 21న పదవీ విరమణ తర్వాత నారాయణ మూర్తి గౌరవ చైర్మన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

బ్యూరోక్రటిక్‌గానూ ఉన్నాం..
విలువలను పణంగా పెట్టకుండా.. వ్యాపారాలను చట్టబద్ధంగా, నైతికతతో కూడా నడపవచ్చని ఇన్ఫోసిస్ చేసి, చూపించిందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఆ విధంగా లక్షలాది యువతీ, యువకులకు స్ఫూర్తిగా నిల్చామన్నారు. 30 ఏళ్ల ప్రస్థానంలో ఇన్ఫోసిస్ అప్పుడప్పుడు బ్యూరోక్రటిక్‌గా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన విశ్లేషించారు. కొన్ని సందర్భాల్లో కొందరు అధికారులు చురుగ్గా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారన్నారు. వ్యాపార విలువలకు విఘాతం ఏర్పడే పరిస్థితులూ ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సీనియర్ కొలీగ్ రాజీనామాను ఆమోదించాల్సి రావడం, నైతిక విలువలకు విఘాతం కలిగే పరిస్థితిని ఎదుర్కొవాల్సి రావడం వంటి ఉదంతాలు విలువల పట్ల తమ నిబద్ధతకు సవాళ్లుగా నిల్చాయని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ‘ఒక సహ వ్యవస్థాపకుడి రాజీనామాపై ఒంటరిగా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సి రావడమనే పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నా’ అని తెలిపారు. విలువలకు ప్రాధాన్యమిచ్చినందుకే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన సంస్థతో సైతం వ్యాపారాన్ని వదులుకున్నామన్నారు.

బాధ కలిగించింది..
ఇటీవలే కంపెనీ విధానాలపై కినుకతో వైదొలిగిన ఇద్దరు డెరైక్టర్లు టీవీ మోహన్ దాస్ పాయ్, కె. దినేష్‌లను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఆరోపణలు తనకు బాధ కలిగించాయని నారాయణ మూర్తి తెలిపారు. ఎన్నో నిద్రలేని రాత్రులకు గురిచేశాయన్నారు. ఇన్ఫోసిస్ ప్రయాణమనేది అసాధారణమైన మారథాన్‌గా అభివర్ణించిన మూర్తి.. కొందరికి అవసరాలు తీరిపోగానే కంపెనీ విలువలు కనిపించవని, మారథాన్ నుంచి తప్పుకుంటారని వారి తీరును ఆక్షేపించారు. బాధ్యత గల ఒక లీడరుగా ఇలాంటి వారెందరికో కంపెనీ వెలుపల సైతం అవకాశాలు లభించేలా ఇన్ఫోసిస్ కృషి చేసిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని మూర్తి పేర్కొన్నారు.

ఉద్యోగులకు ఇప్పటిదాకా రూ.50 వేల కోట్ల స్టాక్ ఆప్షన్స్..
కంపెనీ ఆవిర్భావం నుంచి ఉద్యోగుల పట్ల ఇన్ఫోసిస్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని నారాయణ మూర్తి తెలిపారు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఉద్యోగులకు రూ.50,000 కోట్ల ( షేర్ ప్రస్తుత ధర ప్రకారం) విలువ చేసే స్టాక్ ఆప్షన్స్ ఇచ్చామన్నారు. దేశంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇచ్చిన దాఖలాలు లేవని నారాయణ మూర్తి తెలిపారు. 2010 మార్చికి ముందు తమ కంపెనీలో చేరిన ఏ స్థాయి ఉద్యోగైనా సరే ప్రస్తుతం ఇన్ఫోసిస్ స్టాక్‌హోల్డరుగా ఉన్నారన్నారు.

నైతికంగా నిలబడి చూపించాం..
వ్యాపారాన్ని నైతిక విలువలతోనూ, చట్టబద్ధంగానూ నడపవచ్చని ఇన్ఫోసిస్ చేసి చూపించింది. ఆ విధంగా దేశంలోని ఎన్నో లక్షల మంది యువతీ, యువకులకు స్ఫూర్తినిచ్చాము. నా ఉద్దేశం ప్రకారం.. ఇన్ఫోసిస్ చేసిన అత్యుత్తమ కృషి ఇదే’

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot