మహీంద్రా సత్యం బ్యాంకు ఖాతాల తాత్కాలిక స్తంభన

Posted By: Super

మహీంద్రా సత్యం బ్యాంకు ఖాతాల తాత్కాలిక స్తంభన

హైదరాబాద్: ప్రముఖ ఐటి సంస్థ "మహీంద్రా సత్యం" (గతంలో సత్యం కంప్యూటర్స్) కంపెనీకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలలో లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సదరు బ్యాంకు ఖాతాలలో మహీంద్రా సత్యం కంపెనీ అధికారులు గానీ మరియు ఆదాయపుపన్ను శాఖ అధికారులు గానీ మార్చి 31వ తేదీ వరకూ ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది.

గడచిన 2004 నుంచి 2009 వరకు వచ్చిన ఆదాయంపై రూ. 616 కోట్ల పన్ను బకాయిలను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ మహీంద్రా సత్యంకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మహీంద్రా సత్యం కంపెనీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చింది. దీంతో కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ వి.వి.ఎస్ రావు, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించి ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన మొత్తం రూ. 616 కోట్లని, కానీ.. ఇలా బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం వలన రూ. 1,300 కోట్లు బ్యాంకులోనే ఉండిపోతాయని, ఫలితంగా కంపెనీ కార్యకలాపాలకు ఆటంకం వాటిళ్లే అవకాశం ఉందని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అవసరమైతే.. ఐటి శాఖకు చెల్లించాల్సిన రూ. 616 కోట్ల సొమ్మును బ్యాంకు ఖాతాలోనే ఉంచి, మిగిలిన మొత్తాలను వాడుకునేందుకు అనుమతినివ్వాలని ఆయన కోరారు.

ఇరువర్గాల వాదనలను విన్న ధర్మాసనం ఈ నెలాఖరు వరకు కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 30కు వాయిదా వేసింది. కాగా.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై ఏమీ ఉండదని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని మహీంద్రా సత్యం తమ ఉద్యోగులతో తెలిపింది. ఆదాయ పన్ను శాఖ డిమాండ్ చేస్తున్న రూ. 616 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలోనే బ్యాంకు ఖాతాల్లో నిల్వలున్నాయని తమ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఇ-మెయిల్ సందేశంలో కంపెనీ పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot