త్వరలో మహింద్రా సత్యంలో 17వేల కొత్త కొలువులు: వినీత్‌ నయ్యర్‌

Posted By: Staff

త్వరలో మహింద్రా సత్యంలో 17వేల కొత్త కొలువులు: వినీత్‌ నయ్యర్‌

త్వరలోనే 17 వేల కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మహింద్రా సత్యం వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశాయి. దేశీయ ఐటీ రంగంలో నిలదొక్కుకునేందుకు ప్రస్తుతం సంస్థలో 17వేల ఉద్యోగులు అవసరమని మహింద్రా సత్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే 12 వేల ఉద్యోగ నియామకాలను నేరుగా చేపట్టేందుకు ప్రయత్నిస్తుండగా, మరో 5 వేల ఉద్యోగులను క్యాంపస్‌ రిక్రుట్‌మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటోంది. ఇక ప్రస్తుతం మహింద్రా సత్యంలో 30 వేల ఉద్యోగులుండగా, ఈ ఏడాదిలో చేపట్టనున్న నియామకాలతో 50 వేలకు చేరనుంది.

మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.327 కోట్ల నికర నష్టం వాటిల్లినట్లు మహింద్రా సత్యం వర్గాలు ప్రకటించాయి. సంస్థాగతంగా పెరిగిన ఖర్చులే కారణమని పేర్కొన్న మహింద్రా సత్యం ఛైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌..అమెరికా సెక్యురిటీస్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డుకు చెల్లించిన మొత్తాలే ప్రస్తుత నష్టాలకు ప్రధాన కారణమన్నారు. ఇక 2010-11 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకీకృత నికర నష్టం రూ.147.3 కోట్లుగా నమోదైందని, 2009-10లో రూ.124.6 కోట్ల నష్టం వాటిల్లిందని వినిత్‌ నయ్యర్‌ వివరించారు. ఆదాయపరంగానూ వెనకబడినట్లు పేర్కొన్న నయ్యర్‌..గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,145 కోట్ల ఆదాయం వచ్చిందని, అంతకుముందు ఏడాదిలో రూ.5,481 కోట్లు సాధించామన్నారు.

మహింద్రా సత్యం టెక్‌ మహింద్రాల మధ్య జరుగుతున్న విలీన ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికాస్త గడువు పట్టనున్నట్లు మహింద్రా సత్యం ఛైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ తెలిపారు. న్యాయస్థాన సంబంధ వ్యవహారాల కారణంగానే విలీన ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నయ్యర్‌ వెల్లడించారు. రెండు సంస్థల విలీనం కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుతోపాటు మహారాష్ట్ర హైకోర్టులను సంప్రదించామని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మాసాలలో విలీనం జరగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా రామలింగరాజు నేతృత్వంలో సత్యం కంప్యూటర్స్‌గా కార్యకలాపాలు నిర్వహించి అనంతరం ఆర్థిక లావాదేవీలపరంగా జరిగిన అవకతవకలతో మహింద్రాల చేతికి వెళ్ళిన సత్యం కంప్యూటర్స్‌ తదనంతర పరిణామల క్రమంలో మహింద్రా సత్యంగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot