ఐపీఎల్ 2025లో సందడి చేసిన రోబో డాగ్.. దీని విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
IPL 2025 Robot Dog: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఈసారి సరికొత్త సాంకేతికతతో అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ఒక రోబో కుక్క ఏకంగా టోర్నమెంట్ ప్రసారాల బృందంలో చేరింది. అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ, సంచలనం సృష్టిస్తోంది. ఈ రోబోలో కెమెరా కూడా ఉంది. ఇది నడుస్తుంది, పరిగెడుతుంది, అంతేకాదు ఆటగాళ్లతో, అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది.
* మైదానంలో మొదటిసారి ఎక్కడ కనిపించింది..
ఈ రోబో కుక్క మొదటగా ఏప్రిల్ 13న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో కనిపించింది. దీన్ని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ అయిన డానీ మోరిసన్ (Commentator Danny Morrison) అధికారికంగా పరిచయం చేశాడు.

ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేసిన ఓ వీడియోలో, మోరిసన్ దీని గురించి చెప్తూ.. "ఇది నడుస్తుంది, పరిగెడుతుంది, గ్రీట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్య విశేషమేంటంటే, దీనికి పెంపుడు కుక్క లాంటి చూపు ఉంది" అని అన్నారు. ఈ వీడియో చూసిన వెంటనే వైరల్ అయిపోయింది.
* ఆటగాళ్లను, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచిన రోబో
ఈ రోబో కుక్క మైదానంలోకి వచ్చిన తీరే వేరు. రెండు కాళ్లపై నిలబడటం, కాళ్లతో గుండె ఆకారం చేయడం లాంటి మూమెంట్స్ చేసి చూపించింది. తనదైన స్టైల్‌లో ఎనర్జీగా ఉండే డానీ మోరిసన్, దాన్ని చూసి "దానికి మరీ దగ్గరగా వెళ్లకండి" అని సరదాగా అన్నారు. వెంటనే అక్కడున్న అందరి దృష్టి దానిపై పడింది.
ఆటగాళ్లు, చూస్తున్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ కాస్త కంగారుగా చూస్తే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం నవ్వి దాన్ని ప్రేమగా పలకరించాడు. ముంబై బౌలర్ రీస్ టోప్లీ అయితే అది తనవైపు వస్తుంటే షాకైనట్లు కనిపించాడు.
ఇంకో మ్యాచ్‌లో, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏకనా స్టేడియంలో జరిగినప్పుడు, టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఆ రోబోతో కాసేపు సరదాగా ఆడుకున్నాడు. దాన్ని ఎత్తి పక్కకు పెట్టాడు. దాంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.
* అందరి మనసు దోచిన 'రోబో'కు పేరు..
మొదట్లో ఈ రోబో కుక్కకు పేరు లేదు. కానీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే పెద్ద మ్యాచ్ (హై వోల్టేజ్ క్లాష్) ముందు, ఐపీఎల్ టీమ్ దానికి అధికారికంగా పేరు పెట్టింది, అదే 'చంపాక్'. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా అనౌన్స్ చేశారు.
దీంతో ఆ రోబో కుక్కకు కొత్త ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు అది కేవలం ఒక టెక్నాలజీ వస్తువు మాత్రమే కాదు, ఐపీఎల్ కుటుంబంలో ఒక భాగమైపోయింది. అంపైర్ కెమెరాల నుంచి స్పైడర్ కెమెరాల వరకు, టెక్నాలజీని కొత్తగా వాడటంలో ఐపీఎల్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. ఇప్పుడు 'చంపాక్' రాకతో అభిమానులకు కొత్త అనుభవం వచ్చింది.
ఇది కేవలం ఒక కూల్ గాడ్జెట్ మాత్రమే కాదు, ఆటను చూడటానికి, ఫీల్ అవ్వడానికి ఓ కొత్త మార్గం. ఎంటర్టైన్మెంట్, కొత్తదనం, ఆటగాళ్లు, ఫ్యాన్స్‌తో కలిసే అవకాశం. వీటన్నింటినీ జోడించి, ఇది కేవలం క్రికెట్ లీగ్ మాత్రమే కాదు ప్రపంచ స్థాయి క్రీడా వేడుక అని ఐపీఎల్ 2025 మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications








