టెక్ మహీంద్రాలో సత్యం విలీనం వద్దు: వాటాదారులు

Posted By: Staff

టెక్ మహీంద్రాలో సత్యం విలీనం వద్దు: వాటాదారులు

ఐటీ కంపెనీ మహీంద్రా సత్యంను పేరెంట్ కంపెనీ టెక్ మహీంద్రాలో ప్రతిపాదిత విలీన ప్రక్రియకు వాటాదారులు ససేమిరా అంటున్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న కంపెనీల మధ్య ఇటువంటి ప్రక్రియ జరిగితే వాటాదారులకు మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. ప్రస్తుతం మహీంద్రా సత్యం వాల్యుయేషన్ చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో విలీనమంటే సమ్మతం కాదని స్పష్టం చేస్తున్నారు.

బుధవారమిక్కడ సత్యసాయి నిగమాగమంలో మహీంద్రా సత్యం ఏజీఎం జరిగింది. సుమారు 50 మంది షేరుహోల్డర్లు ఇందులో పాల్గొన్నారు. వాటాదారులు పెట్టుబడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ నిరసన గళాన్ని కంపెనీ చైర్మన్ వినీత్ నయ్యర్‌కు వినిపించారు. కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే విలీనానికి వెళ్లాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియ విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు వదిలేయాలని వాటాదారులను ఉద్దేశించి వినీత్‌ నయ్యర్ స్పష్టం చేశారు. విలీనం అనంతరం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రీలిస్టింగ్ విషయాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన మహీంద్రా సత్యం ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో రూ.225.2 కోట్ల ఏకీకృత నికర లాభాలను ఆర్జించినట్లు తెలిపింది. గత మూడేళ్ళుగా సత్యం కంప్యూటర్స్‌ నుంచి మహింద్రా సత్యంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలు సంతృప్తినిచ్చాయని ఈ సందర్భంగా మహింద్రా సత్యం చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ తెలిపారు. జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.1,433.9 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని సాధించామని, గతంతో పోల్చితే ఇది 14 శాతం అధికమన్నారు. అంతేగాక ఏప్రిల్‌-జూన్‌ మధ్య 2,172 మందిని కొత్తగా నియమించుకున్నామని, దీని వలన ప్రస్తుతం సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 31,438కి చేరిందని స్పష్టం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot