Windows 10 వాడుతున్నారా.. ఒకసారి సెట్టింగ్స్ చెక్ చేసుకోండి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. Windows 10 ఓఎస్ సేవలు చివరి దశకు చేరుకున్నాయని వెల‌్లడించింది. వినియోగదారులు ఇక నుంచి ఈ OSపై ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు పొందలేదని ప్రకటన చేసింది. 22H2.. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్(OS)కు చివరి వెర్షన్‌గా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో వెల్లడించింది.
ప్రస్తుత OS విండోస్ 10 వినియోగిస్తున్న వారికి నెలవారీగా విడుదల చేస్తున్న అప్‌డేట్లు మాత్రం కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతాయని తెలిపింది. ఆ అప్‌డేట్లు కూడా 2025 అక్టోబర్ 14 నుంచి నిలిచిపోతాయని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా తన వినియోగదారులకు విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాలని సూచిస్తోంది. సుమారు ఏడాదిన్నర నుంచి విండోస్ 11 వినియోగదారులకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం విండోస్ 10ను వినియోగిస్తున్న వారు ఉచితంగానే విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఇప్పటికీ విండోస్ 7 సహా అంతకు ముందు వెర్షన్ల OS వినియోగిస్తున్నవారు మాత్రం విండోస్ 11 సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఆసుస్, శ్యామ్‌సంగ్ లాప్‌ట్యాప్ లేదా కంప్యూటర్లు కొత్తగా కొనుగోలు చేసేవారికి.. విండోస్ 11 OS ఇన్‌స్టాల్ చేసి వస్తుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
విండోస్ 11 ఓఎస్‌కు మారేందుకు కంప్యూటర్ సీపీయూ లేదా ల్యాప్‌టాప్ TPM 2.0 కంపాక్టబిలిటీని కలిగి ఉండాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కొన్ని పాత సీపీయూలు కూడా ఈ కంపాక్టబిలిటీని కలిగి ఉంటాయని పేర్కొంది. ఆసుస్, అసర్ సంస్థలు TPM 2.0కు మారేందుకు సీపీయూలకు అప్‌డేట్లు విడుదల చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. కాబట్టి మీ సీపీయూ కాస్త పాతది అయినప్పటికీ విండోస్ 11 సపోర్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.
విండోస్ 10 వినియోగదారులు తమ కంప్యూటర్ లేదా లాప్‌ట్యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి విండోస్ 11 అప్‌డేట్ ఉందో లేదో పరిశీలించుకోవాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. అయితే ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లు విండోస్ 11 సపోర్ట్ చేసే పరిస్థితి లేకపోతే అప్‌డేట్లు వచ్చే అవకాశం లేదని సంస్థ తెలిపింది. అలాంటి వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే వినియోగదారులు మరో విషయాన్ని గుర్తించుకోవాలని. మరో రెండేళ్లపాటు విండోస్ 10 పనిచేయనుందని, అంత వరకు సేవలను పొందవచ్చని తెలిపింది.
ఇప్పటికీ చాలా మంది వినియోగిస్తున్న విండోస్ 7 2009లో రిలీజ్ అయింది. అనంతరం మూడేళ్ల తర్వాత విండోస్ 8 విడుదల అయింది. 2013 సంవత్సరంలో విండోస్ 8.1 అందుబాటులోకి వచ్చింది. విండోస్ 8, 8.1 పెద్దగా పాపులర్ కాలేదు. 2015లో విండోస్ 10ను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది.
అనంతరం 2021లో విండోస్ 11 అందుబాటులోకి వచ్చింది. 2020లో విండోస్ 7 అప్‌డేట్, సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. 2022 చివర్లో విండోస్ 8.1 సపోర్ట్ కూడా ఆగిపోయింది. అయినా ఇప్పటికీ చాలా మంది తన కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లో విండోస్ 7ను వినియోగిస్తుంటారు. దీని వల్ల సెక్యూరిటీ సమస్యలు వస్తాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది.


Click it and Unblock the Notifications