మొబైల్ సిమ్ కొంటున్నారా..? ఒరిజినల్స్ చూపాల్సిందే!

Posted By: Super

మొబైల్ సిమ్ కొంటున్నారా..? ఒరిజినల్స్ చూపాల్సిందే!

 

న్యూఢిల్లీ: నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మొబైల్ కనెక్షన్లు పొందే వారు, వాటిని విక్రయించేవారు ఇకపై మరిన్ని కఠిన చర్యలు ఎదుర్కొవల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్ కార్డు కోసం సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని అనుమానమొస్తే పోలీసు దర్యాప్తును ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ మేరకు టెలికం విభాగం(డాట్) రూపొందించిన కఠిన మార్గదర్శకాలు ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం ఇకపై సిమ్ కార్డులు అమ్మే రిటైలరు .. దరఖాస్తుదారును తాను వ్యక్తిగతంగా చూశానని, దరఖాస్తు ఫారంలో ఉన్న ఫొటో వారిదేనని కంపెనీకి హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే, కస్టమర్ దాఖలు చేసిన చిరునామా, గుర్తింపు పత్రాలు.. అసలు డాక్యుమెంట్లతో సరిపోయాయని ధృవీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం కస్టమరు దాఖలు చేసిన పత్రాలతో పాటు ఒరిజినల్స్ కూడా ఫోర్జరీ చేసినవని తేలిన పక్షంలో రిటైలర్లు, ఫ్రాంచైజీలు ఆ విషయాన్ని టెలికం ఆపరేటరు దృష్టికి తీసుకెళ్లాలి. 15 రోజుల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

అసలు వ్యక్తికి తెలియకుండా వారి పత్రాలపై మరొకరికి సిమ్ కార్డు విక్రయిస్తే, సదరు రిటైలర్‌పై టెలికం ఆపరేటర్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. తప్పుడు విధానాలకు పాల్పడే విక్రేతలు, సబ్‌స్క్రయిబర్స్‌పై చర్యలు తీసుకోని పక్షంలో సదరు టెలికం ఆపరేటర్లపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ మార్గదర్శకాల అమలు కోసం చర్యలు చేపట్టినట్లు జీఎస్‌ఎం సంస్థల సమాఖ్య సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot