మోటరోలా ఇక మా అడుగు జాడల్లో: గూగుల్

Posted By: Super

మోటరోలా ఇక మా అడుగు జాడల్లో: గూగుల్

శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్ ఫోన్స్‌ని రూపొందించేటటువంటి మోటరోలా మొబిలిటీ హోల్డింగ్స్‌ ఐఎన్‌సిని విలీనం చేసుకునేందుకు గూగుల్‌ వేసిన టేకోవర్‌ బిడ్‌కు ఆమోదం లభించింది. ఈ డీల్‌ కోసం 12.5 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు గూగుల్‌ ముందుకురాగా, మోటరోలా వాటాదారులు అందుకు అంగీకరించారు. మోటరోలాను కొనుగోలు చేయడానికి కారణం మొబైల్ హ్యాండ్‌సెట్ రంగంలో గూగుల్ ఉనికి అంతంత మాత్రం ఉండడంతో మోటరోలాని తమలో విలీనం చేసుకుంటే మరింతగా బలపడవచ్చన్నది గూగుల్‌ అభిప్రాయం.

ఈ డీల్‌ ఆగస్టులో ప్రతిపాదనకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ ఈక్విటీ వాటా విలువకన్నా 60 శాతం ప్రీమియం వాటాదారులకు దక్కనుండడమే వారి నుంచి అద్భుత స్పందన తీసుకువచ్చిందని, దీనికి తోడు గూగుల్‌ వంటి దిగ్గజం మోటరోలాను కొనుగోలు చేస్తే ఆండ్రాయిడ్‌ వంటి అధునాతన ఆపరేటింగ్‌ వ్యవస్థలు తక్కువ ధర ఫోన్లలోనూ లభ్యమవుతాయని, ఫలితంగా స్మార్ట్‌ ఫోన్ల ధరలు దిగివస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, ఇందుకు యుఎస్‌ నియంత్రణా సంస్థల అనుమతి తప్పనిసరి. ఇప్పటికే డీల్‌ను గురించిన పూర్తి సమాచారం, టేకోవర్‌ ప్రణాళిక తదితర వివరాలు వెల్లడించాలని యుఎస్‌ కాంపిటీషన్‌ వాచ్‌డాగ్‌ రెండు మార్లు గూగుల్‌కు నోటీసులు పంపింది. త్వరలోనే తమ వైపు నుంచి సమాధానం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, డీల్‌పై తాము పూర్తి నిర్ణయం తీసుకున్న తరువాత వివరాలు అందిస్తామని గూగుల్‌ పేర్కొనడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot