యాడ్‌లోని లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. చివరికి రూ.1.16 కోట్లు కోల్పోయాడు..!!
సైబర్ నేరాలు ఇటీవల కాలంలో అధికంగా జరుగుతున్నాయి. స్టాక్ ట్రేడింగ్ పేరుతో (Fake Stock investment Scam) జరుగుతున్న మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహా నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా రూ.1.16 కోట్లను కోల్పోయారు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో కనిపించిన ఓ నకిలీ యాడ్ చూసి మోసపోయారు. ఈ తరహా ఘటనలపై ఇటీవలే సైబర్ డోస్త్, PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక సూచనలు చేసింది.
ఫ్రీ ప్రెస్ జర్నల్ ఆధారంగా ముంబైకి చెందిన 49 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్‌కు చెందిన ఓ యాడ్ అతని కంటపడింది. పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు అందులో ఉన్న లింక్ పైన క్లిక్ చేశారు. అయితే ఈ లింక్‌ను క్లిక్ చేయగానే సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చబడ్డారు. అప్పటికే ఆ గ్రూప్‌లో 125 సభ్యులు ఉన్నారు.

అయితే ఈ గ్రూప్‌లో ఉన్న కొందరు.. తాము చెప్పిన ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. తమతోపాటు అనేక మంది భారీగా లాభాలు పొందినట్లు నమ్మించారు. దీంతో నేరగాళ్లు చెప్పిన నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనేక మంది సిద్ధమయ్యారు. ముంబై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా నేరగాళ్ల మాటలు విని వారు చెప్పిన ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
అనంతరం ఆగస్టు 16 నుంచి ఆగస్టు 20 తేదీల మధ్య ఈ నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లోని వ్యక్తులు చెప్పిన ఖాతాలకు సుమారు రూ.1.16 కోట్లు బదిలీ చేశారు. అయితే అనంతరం తన ట్రేడింగ్ ఖాతా నుంచి తన పెట్టుబడి సహా లాభాలను విత్‌డ్రా చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు.
అయితే తన నగదును వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే పెట్టుబడి సహా లాభాలను వెనక్కి తీసుకొనేందుకు మరికొంత నగదును పెట్టుబడి పెట్టాలని సూచించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ముంబై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ తరహా సైబర్ మోసాలపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం, సైబర్ దోస్త్ కీలక సూచనలు చేశాయి. ఈ తరహా ఘటన్లలో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. వారు చెప్పిన లింక్స్ ద్వారా సోషల్ మీడియా గ్రూపుల్లో చేరిన తర్వాత తాము ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నట్లు ఇతరులను నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారని తెలిపింది.
అనంతరం తాము చెప్పిన స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలలో పెట్టుబడి పెట్టాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను సంపాదించవచ్చంటూ మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. ఈ తరహా మోసాలబారిన పడకుండా ఉండేందుకు కీలక సూచనలు చేసింది.
కచ్చితంగా లాభాలు వస్తాయని లేదా మీ పెట్టుబడిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని హామీలిచ్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతోపాటు పెట్టుబడి పెట్టే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేరగాళ్లు ఒత్తిడి చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రోకరేజీ సంస్థల రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications








