డిజిటల్ అరెస్ట్‌లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యల అనంతరం వెలుగులోకి షాకింగ్ వివరాలు..!
డిజిటల్ అరెస్ట్ Digital (Arrest) ఘటనలపై ప్రధాన మంత్రి మోడీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ అరెస్ట్ ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అధికారులు లేదా సంస్థలు ఎవరూ డిజిటల్ ఈ తరహా వేదింపులకు పాల్పడరని స్పష్టం చేశారు. సందర్భాల్లో ప్రజలు ఎలా వ్యవహరించాలో తెలిపేలా వీడియో ప్రదర్శించి కీలక సూచనలు చేశారు. ఈ తరహా సైబర్ నేరాల సమయాల్లో ఆగండి.. ఆలోచించండి.. ఆపై స్పందించండి అంటూ ప్రజలకు సూచించారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.
నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ఆధారంగా... ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు సైబర్ నేరాలపై 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. భారత్‌లో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్‌లు ఎక్కువగా మయన్మార్, లావోస్, కంబోడియా దేశాల కేంద్రంగా జరుగుతున్నాయని తెలిపింది.

2023 సంవత్సరంలో సైబర్ నేరాలపై 15.56 లక్షలు, 2022 లో 9.66 లక్షలు, 2021 లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు NCRP వెల్లడించింది. డిజిటల్ అరెస్ట్ రూ.120.3 కోట్లు, ట్రేడింగ్ స్కామ్‌ల్లో రూ.1420.48 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు రూ.222.58 కోట్లు, రొమాన్స్/ డేటింగ్ కేసుల్లో రూ.13.23 కోట్లు ప్రజలు కోల్పోయినట్లు తెలిపింది.
ప్రతి సంవత్సరం ఈ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ప్రజలను బెదిరించి, తీవ్ర ఆందోళనకు గురిచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ తరహా ఘటనల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
డిజిటల్ అరెస్ట్ ఘటనలపై రాష్ట్రాల సాయంతో దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని మోడీ తెలిపారు. లక్షలాది వీడియో వీడియో కాలింగ్ ఐడీలు, సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్‌లను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇలాంటి సమయాల్లో నేరగాళ్ల ఫోన్ కాల్ రికార్డు చేయడం లేదా వాళ్ల ఫోటోలను స్క్రీన్ షాట్ తీసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
డిజిటల్ అరెస్ట్ సహా సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి సమాచారం అందించాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదన్న ప్రధాని మోడీ.. ప్రజలను మోసం చేసేందుకే ఈ పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
డిజిటల్ అరెస్ట్ అంటే..?
RBI, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు పేరుతో కొందరు ఫోన్‌లు చేస్తారు. వివిధ కేసుల పేర్లతో బెదిరింపులకు పాల్పడతారు. తాము చెప్పేంత వరకు వీడియో కాల్‌లోనే ఉండాలని సూచిస్తారు. తీవ్ర ఆందోళనకు గురిచేసి మీ దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టుకుంటారు. కేసుల నుంచే తప్పించేందుకు నగదు డిమాండ్ చేస్తారు.
తాము చెప్పినట్లు చేయాలని లేకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడతారు. మీ పరిస్థితిని బంధువులు, స్నేహితులకు చెప్పే అవకాశం కూడా లేకుండా చేస్తారు. ప్రస్తుతం ఈ తరహా ఘటనలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఘటనల్లో బాధితులు.. ఇతరులకు అవగాహన కల్పించాలని ప్రధాని మోడీ సూచించారు.


Click it and Unblock the Notifications








