నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు మళ్లీ పైపైకి!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచేసింది. అమెరికా, కెనడా, పోర్చుగల్, అర్జెంటీనా దేశాల్లో ఈ పెంపుదల తక్షణమే అమల్లోకి వస్తుంది. కొత్త కంటెంట్, సర్వీసులను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది.

* కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
యాడ్స్‌తో కూడిన ప్లాన్ ఇంతకుముందు 6.99 డాలర్లు (సుమారు రూ.604) ఉండగా, ఇప్పుడు 7.99 డాలర్ల (దాదాపు రూ.690)కి పెరిగింది. యాడ్స్ లేని స్టాండర్డ్ ప్లాన్ ధర 15.49 డాలర్ల నుంచి 17.99 డాలర్ల (దాదాపు రూ.1,554)కి పెరిగింది.
ప్రీమియం ప్లాన్ ఏకంగా 22.99 డాలర్ల నుంచి 24.99 డాలర్లకి పెరిగింది. నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. 2022లో తీసుకొచ్చిన యాడ్స్ ప్లాన్ ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇండియాలోనూ ఈ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
* ధరలు పెంచినా.. తగ్గని యూజర్ల సంఖ్య
ధరలు పెంచినా నెట్‌ఫ్లిక్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గత కొద్ది నెలల్లోనే 1.9 కోట్ల కొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌లో చేరారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరుకుంది. అంతేకాదు, కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం కూడా మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను దాటేసింది.
* ఇంట్లో లేని వాళ్లూ నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు
నెట్‌ఫ్లిక్స్ "ఎక్స్‌ట్రా మెంబర్ విత్ యాడ్స్" అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా యాడ్స్ ప్లాన్ తీసుకున్న యూజర్లు ఎక్స్‌ట్రా ఫీజు చెల్లిస్తే తమ ఇంట్లో లేనివారికి (Outside their household) కూడా నెట్‌ఫ్లిక్స్ చూసే అవకాశం కల్పించవచ్చు.
* హిట్ షోలే దీనికి కారణం..
నెట్‌ఫ్లిక్స్ సక్సెస్ వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను రిలీజ్ చేయడం. స్క్విడ్ గేమ్ లాంటి గ్లోబల్ హిట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టాయి. అంతేకాదు, ఈ సిరీస్‌తో సౌత్ కొరియా వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
* ఇంకా చాలా ఉన్నాయి
ఇకపై స్ట్రేంజర్ థింగ్స్, వెడ్నెస్ డే వంటి పాపులర్ సిరీస్‌ల కొత్త సీజన్‌లు రాబోతున్నాయి. క్రిస్మస్ రోజున NFL గేమ్స్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాదు, WWE రెజ్లింగ్ కూడా 52 వారాలపాటు నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. స్పెషల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తోంది.
* యాడ్స్ ప్లాన్‌కు పెరుగుతున్న ఆదరణ..
యాడ్స్ తో కూడిన ప్లాన్‌కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్న వారిలో 55% మంది ఈ ప్లాన్‌నే ఎంచుకుంటున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 30% ఎక్కువ. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2023 చివర్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను కట్టడి చేయడంతోపాటు ఈ యాడ్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
2025 నాటికి 43.5 డాలర్ల నుంచి 44.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 29% ఆపరేటింగ్ మార్జిన్‌ను సాధించాలని నెట్‌ఫ్లిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ పెరుగుతుండటంతో.. నెట్‌ఫ్లిక్స్ మరింత దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








