సిమ్ కార్డ్ ఫోన్‌లో ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుందా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
SIM binding Rule మీ ఫోన్‌లో సిమ్ కార్డ్ తీసేస్తే వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుందని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పటివరకు ఒకసారి లాగిన్ అయితే వై-ఫైతో కూడా వాడుకునే సౌలభ్యం ఉంది. కానీ త్వరలో ఈ విధానం మారబోతోంది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధన ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉంది.
సిమ్ ఉంటేనే యాప్ పనిచేస్తుంది..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal) వంటి మెసేజింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు, ఆ అకౌంట్ కచ్చితంగా ఫోన్‌లో ఉన్న యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం లింక్ చేసి ఉండాలి.

అంటే సిమ్ కార్డ్ లేని టాబ్లెట్, ల్యాప్‌టాప్ లేదా సెకండరీ ఫోన్‌లో ఇకపై ఈ యాప్స్ పనిచేయకపోవచ్చు. అంతేకాదు, వాట్సాప్ వెబ్ (WhatsApp Web) కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అయిపోతుందని, మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వస్తుందని సమాచారం. సైబర్ మోసాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్ తీసుకొస్తోంది. .
అసలు వివాదం ఏంటి?
డిజిటల్ మోసాలను అరికట్టడం మంచిదే అయినా, దీనివల్ల ప్రభుత్వానికి ఓటీటీ (OTT) యాప్స్‌పై అతిగా పట్టు చిక్కుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారిత యాప్స్ సాధారణంగా ఐటీ శాఖ (MeitY) పరిధిలోకి వస్తాయి. కానీ, టెలికాం చట్టం 2023 ను ఉపయోగించి టెలికాం శాఖ (DoT) వీటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాన్యులకు, ప్రొఫెషనల్స్‌కు తిప్పలే..
ఈ రూల్ అమలైతే న్యాయపరమైన చిక్కులే కాదు, వాడకంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆఫీస్ పనుల కోసం మల్టీ డివైజ్ (Laptop, iPad) ఫీచర్ వాడే వారికి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంటే, ఆ అకౌంట్ నుంచి జరిగే పనులకు వారే బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయి తప్పు జరిగినా, మీరే నిర్దోషి అని నిరూపించుకోవాల్సి రావచ్చు. టెక్నికల్‌గా చూస్తే, ఇలా నిరంతరం సిమ్ చెక్ చేయడం వల్ల యాప్ స్పీడ్ తగ్గడం లేదా బ్యాటరీ డ్రైన్ అవ్వడం వంటి సమస్యలు రావచ్చని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమయం చాలా తక్కువ..
ఈ కొత్త మార్పులు చేయడానికి ప్రభుత్వం యాప్ కంపెనీలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి పెద్ద నిర్ణయాలకు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని విమర్శలు ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో టెక్నికల్‌గా మార్పులు చేయడం కష్టమని నిపుణులు అంటున్నారు.
బ్యాంకింగ్ యాప్స్‌తో పోలిక కరెక్టేనా?
బ్యాంకింగ్ యాప్స్‌లో ఇప్పటికే సిమ్ బైండింగ్ ఉంది కదా, వాట్సాప్‌కు ఎందుకు ఉండకూడదు అని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ నిపుణులు మాత్రం.. బ్యాంకింగ్ యాప్స్ కేవలం డివైజ్ బైండింగ్ (Device Binding) మాత్రమే చేస్తాయని, ఇలా నిరంతరం లైవ్ సిమ్ చెకింగ్ చేయవని క్లారిటీ ఇస్తున్నారు.
టెల్కోలు Vs టెక్ దిగ్గజాలు..
ఈ వ్యవహారం టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ కంపెనీల (Google, Meta) మధ్య మరో యుద్ధానికి తెరలేపింది. జవాబుదారీతనం కోసం ఈ రూల్ అవసరమని టెలికాం సంస్థలు అంటుంటే.. ఇది యూజర్లకు ఇబ్బంది కలిగిస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని గూగుల్, మెటా వంటి సంస్థలు కోరుతున్నాయి.
డిజిటల్ భద్రత ముఖ్యం అనడంలో సందేహం లేదు. కానీ అది యూజర్ల సౌకర్యాన్ని, ప్రైవసీని దెబ్బతీసేలా ఉండకూడదు. మరి ప్రభుత్వం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తుందా లేక ఏమైనా సడలింపులు ఇస్తుందా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








