ఫాస్టాగ్‌పై NHAI కీలక ప్రకటన.. మార్చి 15లోగా అలా చేయకుంటే జరిమానా, రెట్టింపు రుసుములు తప్పవని హెచ్చరిక..!!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు (Paytem payments bank) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మార్చి 15 వరకు గడువు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి ఫాస్టాగ్‌లను కొనుగోలు చేసిన వాహనదారులు వెంటనే ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.
మార్చి 15 తర్వాత జాతీయ రహదారులపై సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా పేటీఎం ఫాస్టాగ్‌లు కలిగి ఉన్న వాహనదారులు అప్రమత్తం కావాలని కోరింది. లేకుండా జరిమానాలు సహా రెట్టింపు టోల్ రుసుం వసూలు చేసే అవకాశం ఉందని జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఇవాళ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఫాస్టాగ్‌ను కలిగి ఉన్న వాహనదారులు తమ ఫాస్టాగ్ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసేందుకు అనుమతి లేదు. గడువు ముగిసేలోగా ఆయా ఖాతాల్లో ఉన్న నగదును వినియోగించుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
ఇప్పటికే ఫాస్టాగ్‌ను జారీచేసే అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరును తొలగించింది. స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి 39 బ్యాంకులు, సంస్థలతో కూడిన జాబితాను విడుదల చేసింది.
మానిటరీ పాలసీలు, ఇతర నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని కారణంగా డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ లావాదేవీలు చేపట్టకూడదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఫిబ్రవరి 29 తర్వాత వాలెట్స్, ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్లు, టాప్-అప్‌లు నిలిచిపోనున్నాయి. అయితే ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.
ఆడిట్ నివేదికల ఆధారంగా బ్యాంకులో ఉల్లంఘనలను గుర్తించామని ఈ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటిడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 2022 సంవత్సరంలోనూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌పై RBI చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లు అకౌంట్లలోని నగదును వినియోగించుకొనేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అంటే పేమెంట్స్ బ్యాంకులోని కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, నేషనల్ మొబిలిటీ కార్టు, ఇతర నగదును విత్‌డ్రా సహా వినియోగించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది. దీంతోపాటు రిఫండ్లు, క్యాష్‌బ్యాక్, వడ్డీపై ఆంక్షలు లేవని పేర్కొంది.
ఆర్‌బీఐ నిర్ణయం అనంతరం ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పెమెంట్స్ బ్యాంకును తొలగించింది. నేషనల్ హైవే అథారిటికి చెందిన రహదారుల నిర్వహణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తమ జాబితాలోని బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని వాహనాదారులకు సూచించింది.


Click it and Unblock the Notifications