మొబైల్ కనెక్షన్ 90 రోజులకు మించి ఇవ్వొద్దు!

Posted By: Prashanth

మొబైల్ కనెక్షన్ 90 రోజులకు మించి ఇవ్వొద్దు!

దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న విదేశీ పర్యాటకులకు మొబైల్ కనెక్షన్ మూడు నెలలకు మించి ఇవ్వరాదని ప్రభుత్వం టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లను ఆదేశించింది. విదేశీ పర్యాటకుల ముసుగులో పలు సంఘవిద్రోహ శక్తులు సిమ్ కార్డులను సేకరించి చట్టువిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టూరిస్టులకు కొత్త మొబైల్ కనెక్షన్లు జారీ చేసే సమయంలో ఈ ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ప్రధానంగా.. సదురు విదేశీ పర్యాటకుని గుర్తింపు కార్డుతో పాటు చెల్లుబాటు వీసాతో కూడిన పాస్‌పోర్ట్ పత్రాలను తప్పనిసరిగా సేకరించాల్సి ఉంది. ఈ పత్రాలు సక్రమమైనవని నిర్ధారణకు వచ్చిన తరువాతే కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని టెలికాం ఆపరేటర్లకు కేంద్రం స్పష్టం చేసింది.

నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్‌కార్డ్ తీసుకుంటే కఠిన చర్యలే!

నకిలీ పత్రాలతో మొబైల్ సిమ్ కార్డులు తీసుకునే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. రిటైల్ మొబైల్ షాపులు, ఫ్రాంచైజీలకు ఫోర్జరీ పత్రాలను సమర్పించి సిమ్‌లు కొనుగోలు చేస్తే ఇకపై పోలీసు కేసు నమోదుకానుంది. కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి పరిశీలనపై టెలికం విభాగం(డాట్) విడుదల చేసిన తాజా నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చారు. దీని ప్రకారం… ఎవరైనా మొబైల్ కస్టమర్ సిమ్‌ల కోసం నకిలీ ధ్రువపత్రాలను ఇవ్వడం, ఒరిజినల్స్ కూడా నకిలీవే అయిన పక్షంలో ఆయా రిటైలర్లు/ఫ్రాంచైజీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేసేలా చూడాలని డాట్ ఆదేశించింది. దీంతోపాటు సంబంధిత టెలికం ఆపరేటర్ దృష్టికి ఈ విషయాన్ని 15 రోజుల్లోగా తెలియజేయాలని కూడా పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ రెండో వారం నుంచి అమల్లోకి రానున్నాయి.

నిబంధనలు ఇవీ…

సిమ్ కార్డులు విక్రయించే అధీకృత వ్యక్తి… కస్టమర్ దరఖాస్తుతో పాటు ఇచ్చిన ఫోటోను సరిపోల్చిచూసినట్లు తెలియజేయాలి. అదేవిధంగా సిమ్ ఎవరిపేరుపై తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసినట్లు కూడా దరఖాస్తులో పేర్కొనాలి.

సిమ్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లల్లో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్స్‌ను కూడా పరిశీలించినట్లు సంబంధిత దరఖాస్తుపై రిటైలర్ సంతకం కూడా చేయాలి.

ఫోర్జరీ పత్రాలు ఇచ్చిన వారిపై రిటైలర్/ఫ్రాంచైజీలు గనుక ఫిర్యాదు/ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయకపోతే… సంబంధిత మొబైల్ ఆపరేటర్ స్పందించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రయిబర్‌తో పాటు రిటైలర్/ఫ్రాంచైజీలపై మూడురోజుల్లోగా ఆపరేటరే పోలీసులకు ఫిర్యాదు లేదా

ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించాలి.

ఒకవేళ ఫోర్జరీ డాక్యుమెంట్‌ల విషయంలో అమ్మకందారు, కస్టమర్లపై చర్యలు చేపట్టకపోతే టెలికం ఆపరేటర్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా ఒక వ్యక్తి ఒక టెలికం సర్కిల్‌లో బల్క్ కనెక్షన్లు తీసుకోవడాన్ని కూడా ఇక నిషేధించనున్నారు. 10కి మించి మొబైల్ కనెక్షన్లను(మొత్తం ఆపరేటర్లందరి నుంచీ) పొందే వీలుండదు.

బల్క్ కనెక్షన్లను యాక్టివేట్ చేసేటప్పుడు కూడా ఆ సబ్‌స్క్రయిబర్ వివరాలను, నివాసాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిందే. అంతేకాకుండా ప్రతి 6 నెలలకూ ఒకసారి రీ-చెక్ చేసుకోవాలి.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot