చైనాలో ఐటి పైరేటెడ్ సీడిలు రోడ్డుమీదనే కుప్పలు తెప్పలుగా: మూర్తి

Posted By: Staff

చైనాలో ఐటి పైరేటెడ్ సీడిలు రోడ్డుమీదనే కుప్పలు తెప్పలుగా: మూర్తి

బెంగళూరు: నాలుగైదేళ్ళ క్రితం చైనాలో విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన ఇన్ఫోసిస్‌ ఆ తరువాత వెనక్కు తగ్గిన కారణాలను వికీలీక్స్‌ బహిర్గతం చేసింది. చైనాలోని బలహీనమైన ఐపిపి గణాంకాలను బూచిగా చూపుతూ క్లయింట్ల నుంచి వచ్చిన ఒత్తిడితోనే చైనాకు దూరమైనామని సంస్థ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి 2007లో యుఎస్‌ ప్రతినిధులకు తెలియజేశారు. చైన్నైలోని యుఎస్‌ కాన్సులేట్‌ నుంచి తమకు లభించిన కేబుల్స్‌ వివరాల ప్రకారం భారత్‌ వెలుపల విస్తరణ ప్రణాళికలంటే, అమెరికాకే ప్రాధాన్యమిస్తామని కూడా ఆయన వెల్లడించారు.

ఈ కేబుల్ డిసెంబర్‌ 14, 2007 నాటిదని, దీనికి 'ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ ఆన్‌ ఐపిఆర్‌ ఇన్‌ చైనా, హైరింగ్‌ ఇన్‌ యుఎస్‌' అని పేరు పెట్టామని, అన్‌క్లాసిఫైడ్‌/అఫీషియల్‌ యూజ్‌ విభాగంలో ఈ కేబుల్‌ను చేర్చామని వికీలిక్స్‌ తెలిపింది. చైనాలో సంస్థ అభివృద్ధిపై క్లయింట్‌ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని తెలిపిన ఆయన చైనాలో తాము ఎదుర్కొన్న అనుభవాలను కూడా యుఎస్‌ ఎంబసీ అధికారులకు అప్పట్లో వివరించారు. బ్రిటిష్‌ టెలికం సిఇఒ పీటర్‌ బొనీఫీల్డ్‌తో కలసి బీజింగ్‌లో ఓ హోటల్‌ నుంచి వెలుపలికి వచ్చి రోడ్డుపై వెడుతుంటే మైక్రోసాఫ్ట్‌, విండోస్‌లకు చెందిన పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సిడిలు కుప్పలు కుప్పలుగా అమ్మకానికి ఉన్నాయని తెలిపారు.

ఓ కొనుగోలుదారుడితో బొనీఫీల్డ్‌ 'ఫినాకిల్‌ (ఇన్ఫోసిస్‌ తయారు చేసిన బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌) ఉందా'? అని ప్రశ్నించగా, రేపటికి సిద్ధం చేసిస్తానని సమాధానం వచ్చినట్టు నారాయణమూర్తి తెలిపారు. ఇదే సమయంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే చైనా స్పందించే తీరు, దాన్ని పరిష్కరించే విధానం అద్భుతమని ఆయన వివరించారు. 2007లో 300 మందితో ఉన్న ఇన్ఫోసిస్‌ యుఎస్‌ క్యాంపస్‌లో 2008 నాటికి 3 వేల మంది ఉద్యోగులను చేర్చుకోవడం వెనుకు యుఎస్‌ ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉన్నట్టు ఈ కేబుల్స్‌ ద్వారా వెల్లడైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot