Netflix పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తున్నారా.. ఇప్పటి నుంచి కుదరదు..!
భారత్‌లో OTT ప్లాట్‌ఫాంలకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. గతంలో సినిమా అంటే థియేటర్లకే వెళ్లాలనే ప్రేక్షకులు క్రమంగా ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందుకు కరోనా సహా థియేటర్లలో పెరుగుతున్న టికెట్ ఛార్జీలు కూడా ప్రధాన కారణం. ఓటీటీలో ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్నాయి. జియో సినిమా యాప్ కూడా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు కీలక ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం Netflix కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పాస్‌వర్ట్ షేరింగ్ విధానంలో పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్ట్‌ను కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే షేర్ చేసుకోవడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఖాతా వివరాలను ఎవరైతే ఇతరులతో పంచుకుంటున్నారో వారికి ఇవాళ్టి నుంచి వ్యక్తిగతంగా ఈమెయిల్ పంపుతున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒకే కుటుంబం వినియోగించుకొనేందుకు నిర్దేశించబడిందని సంస్థ తెలిపింది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇంట్లో, ప్రయాణాలు, సెలవుల్లో ఎక్కడున్నా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రొఫైల్ బదిలీ, అకౌంట్ యాక్సెస్ వంటి అదనపు సదుపాయాలను కూడా పొందవచ్చని వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం కుటుంబ సభ్యులు అంటే ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించే ఇతర పరికరాలు కూడా నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ (కుటుంబ సభ్యులు)లో భాగం అవుతాయి.
తమ వినియోగదారులకు అనేక ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయని, అందువల్ల అనేక కొత్త సినిమాలు, టీవీషోలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. వినియోగదారుని భాష, ఇష్టం, మానసిక స్థితి ఆధారంగా అన్ని సమయాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ సంతృప్తికర కంటెంట్‌ను అందిస్తుందని పేర్కొంది.
ఆదాయాన్ని పెంచుకోవడం సహా ఇతర కారణాలతో భారత్ సహా ఇండోనేషియా, కెన్యా సహా ఇతర మార్కెట్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇవాళ్టి నుంచి (జులై 20) నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఇతర వ్యక్తులకు నెట్‌ఫ్లిక్ ఖాతా వివరాలు పంచుకోవాలనుకుంటే అదనపు రుసుమును చెల్లించే విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లో అదనపు సభ్యులను ఇక నుంచి అనుమతించడం లేదని తన షేర్‌హోల్డర్‌లకు రాసిన లేఖలో సంస్థ వెల్లడించింది. ఇటీవలే తమ ధరలను తగ్గించినట్లు గుర్తుచేసింది. 2023 సంవత్సరం ప్రారంభంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి సుమరాు 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ పరిమితులు విధించింది.
నెట్‌ఫ్లిక్స్‌కు ప్రస్తుతం భారత్‌లో నాలుగు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉన్నాయి. మొబైల్ ప్రాన్ రూ.149 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రైమరీ ప్లాన్ రూ.199 నుంచి ప్రారంభం అవుతుంది. స్టాండర్డ్ ప్లాన్ రూ.499, ప్రీమియం ప్లాన్ రూ.699 నుంచి ప్రారంభం అవుతుంది. నెట్‌ఫ్లిక్ కొన్ని సంవత్సరాల క్రితం పాస్‌వర్డ్ షేరింగ్‌ను ప్రోత్సహించింది. అనంతరం పెయిడ్ షేరింగ్‌తో ఆదాయం సహా వినియోగదారులు కూడా పెరిగినట్లు తెలిపింది.
ఈ నిర్ణయం భారత్‌లోని నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ఊహించినదే. ఎందుకంటే ఇతర దేశాల్లోకి చాలా రోజుల క్రితమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే భారత్‌లో ఇంత త్వరగా అమల్లోకి వస్తుందని మాత్రం ఊహించి ఉండరు. దీంతో నెట్‌ఫ్లిక్స్ వినియోగానికి అలవాటు పడిన వినియోగదారులు కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








