డేటా మొత్తం ఇండియాలోనే ఉండాలి, పీఎస్‌వోలకు RBI వార్నింగ్
పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు జూన్ 26న డేటా లోకలైజేషన్ నిబంధనలపై ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది.

అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్‌కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొలగించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న (డేటా లోకలైజేషన్) నిబంధనల మీద పీఎస్‌వోలు లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేస్తూ ఆర్‌బీఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది.

కేంద్రమంత్రి చెప్పిన వారం రోజులకే
డేటా ప్రొటక్షన్ పాలసీపై అభ్యంతరాలు సమర్పించాలని కంపెనీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వారం రోజులకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. చెల్లింపులకు సంబంధించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ విదేశాల్లో ప్రాసెసింగ్ చేసిన పక్షంలో ఆ డేటాను 24 గంటల్లోగా భారత్‌కు తీసుకు రావాలని పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు స్పష్టం చేసింది.

ఆరు నెలల గడువు
చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన మొత్తం డేటాను అందరు సిస్టమ్ ప్రొవైడర్లు ఆరు నెలల్లోగా భారత్‌లోనే నిల్వ చేయాలని గత ఏడాది ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రీక్వెట్లీ ఆస్క్‌డ్ క్వశన్స్ రూపంలో ఆర్బీఐ పలు అంశాలు వెల్లడించింది. భారత్ వెలుపల చెల్లింపు లావాదేవీల ప్రాసెసింగ్‌పై ఎటువంటి నిషేధం లేదని, కానీ ప్రాసెసింగ్ తర్వాత ఆ డేటాను భారత్‌లో మాత్రమే నిల్వ చేయాలని పేర్కొంది. మొత్తం లావాదేవీల వివరాలు ఆ డేటాలో భాగంగా ఉండాలని తెలిపింది.

లావాదేవీలకు సంబంధించిన మొత్తం వివరాలు
ప్రాసెసింగ్‌ను విదేశాల్లో జరిపిన పక్షంలో ఇరవై నాలుగు గంటల్లో లేదా ఒక పని దినంలోగా ఏది ముందు అయితే ఆ పద్ధతిలో డేటాను భారత్‌కు తెప్పించాలని పేర్కొంది. లావాదేవీలకు సంబంధించిన మొత్తం వివరాలు, సమాచారం అన్నీ కూడా డేటాలో భాగమేనని పేర్కొంది. ఇందులో వినియోగదారు పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్, ఆధార్, పాన్‌కార్డు వంటి సమాచారం, చెల్లింపు సమాచారం, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి చెల్లింపు వివరాలు, లావాదేవీల సమాచారం వంటివి ఉంటాయి.

RBI కఠిన నిర్ణయంతో
డేటాను దేశం వెలుపల నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉన్న విదేశీ బ్యాంకుల వంటి సంస్థలు మాత్రం యథావిధిగా తమ విధానాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గూగుల్, మాస్టర్ కార్డ్, వీసా, అమెజాన్ డేటా స్థానికీకరణ వల్ల తమ వ్యయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే RBI కఠిన నిర్ణయంతో ఈ సంస్థలు దిగిరాక తప్పలేదు.

అమెజాన్ డేటా
దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డేటా లోకలైజేషన్ నిబంధనల ప్రకారం భారత్‌లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్‌తో జట్టు కట్టింది. తాజాగా వాట్సప్ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది.

మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్
ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








