ఐఫోన్ 16 కెమెరా అంత వరస్ట్‌గా ఉంటుందా.. పేటీఎం సీఈవో సంచలన వ్యాఖ్యలు!
యాపిల్ ఐఫోన్ పర్ఫెక్ట్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్‌తో పోలిస్తే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని యూజర్లు తరచూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా పేటీఎం సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఐఫోన్ 16 కెమెరా క్వాలిటీపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన X (ట్విట్టర్) వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అంతేకాదు, గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌కు మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు.

విజయ్ శేఖర్ తన పోస్ట్‌లో "ఐఫోన్ 16లో కెమెరా (సాఫ్ట్‌వేర్/యాప్) ఇంత దారుణంగా తయారు కావడం చూసి ఆశ్చర్యపోతున్నా. ఇది ఎంత బ్యాడ్‌గా ఉందంటే, నేను పిక్సెల్‌కు జంప్ కావడం గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నా." అని రాసుకొచ్చారు. ఇదే సమస్య తమ ఐఫోన్లలో కూడా ఎదురవుతోందా అని ఇతర ఐఫోన్ యూజర్లను ఆయన ప్రశ్నించారు.
* నెటిజన్ల రియాక్షన్స్
విజయ్ చేసిన ఈ పోస్ట్ చూసి చాలా మంది స్పందించారు. గూగుల్‌లో గతంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన పర్మీందర్ సింగ్ స్పందిస్తూ, "నాకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. కెమెరాలో లేదా యాప్‌లో ఏదో చాలా తప్పు జరుగుతోంది." అని అన్నారు.
మరో యూజర్ వ్యాఖ్యానిస్తూ, "ఐఫోన్ 6తోనే ఇన్నోవేషన్స్ ఆగిపోయాయి. తర్వాత వచ్చిన మోడళ్లు టెక్నికల్ ఫీచర్లతో మాత్రమే అట్రాక్టివ్‌గా నిలిచాయి. ఇప్పుడు, గత మూడు వెర్షన్లు కేవలం కాపీలు మాత్రమే" అని విమర్శించారు.
ఇంకొకరు తమ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, "ఐఫోన్లు కొన్న ఏడాదికే కెమెరా క్వాలిటీ దారుణంగా పడిపోతుంది. మీరు ఏ మోడల్ కొన్నా ఒకటే." అని చెప్పారు.
"ఇది కచ్చితంగా నిజం. బ్రాండ్ పేరుతో గుర్తింపు పొందిన యాపిల్, బ్యాటరీ లైఫ్, యూసేజ్‌ను మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. కంపెనీ ప్రొడక్ట్‌ని మెరుగుపరచడం కంటే డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెట్టిందేమో" అని ఆవేదన వ్యక్తం చేశారు.
* ఇకనైనా మారుతుందా
విజయ్ శేఖర్ వ్యాఖ్యలతో యాపిల్ లేటెస్ట్ కెమెరా అప్‌డేట్లపై చర్చ మొదలైంది. ఇవి వినియోగదారుల అంచనాలను అందుకుంటున్నాయా లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. యాపిల్ కెమెరా క్వాలిటీతో వరల్డ్ వైడ్ గా సూపర్ పాపులర్ అయింది. కానీ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ చేంజెస్ కెమెరా పనితీరును దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.
కొత్త అప్‌డేట్లు గతంలో ఉన్నంత ప్రభావవంతంగా ఉన్నాయా అని చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే యాపిల్ ఇప్పటికే అప్‌కమింగ్ ఐఫోన్ 17 సిరీస్‌తో ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోంది.
కొత్త ఫోన్లలో హీట్‌ని కంట్రోల్ చేయగలిగేలా అడ్వాన్స్‌డ్ హార్డ్‌వేర్‌ను అందించనున్నారని పుకార్లు సూచిస్తున్నాయి, ఇది కెమెరా పనితీరుతో సహా ఓవరాల్ పెర్ఫార్మెన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుందని అంటున్నారు.
* స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ
విజయ్ శేఖర్ శర్మ పిక్సెల్ గురించి ఆలోచించడం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోని పోటీని ఎత్తి చూపుతోంది. గూగుల్ పిక్సెల్ ఫోన్లు కెమెరాల విషయంలో అదరగొడతాయి, అందుకే యాపిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. దీన్ని బట్టి యూజర్ల అంచనాలు ఎలా మారుతున్నాయో తెలుస్తోంది. యాపిల్ కూడా మారాల్సిన టైమ్ వచ్చిందనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








