దక్షిణ భారతంలో తొలి గ్రీన్‌ థియేటర్‌‌గా ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌

Posted By: Super

దక్షిణ భారతంలో తొలి గ్రీన్‌ థియేటర్‌‌గా ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌

పర్యావరణ పరిరక్షణే కాకుండా సౌర శక్తితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో సినిమా థియేటర్లనూ నడపొచ్చని ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ నిరూపించింది. వంద కిలో వ్యాట్స్‌ విద్యుత్తు సామర్థ్యం గల సోలార్‌ ఫోటో వోల్టాయిక్‌ జనరేషన్‌ సిస్టిమ్‌ను నెక్లెస్‌ రోడ్డులోని ఈ థియేటర్‌ టెర్రస్‌పై ఏర్పాటుచేశారు. దీనిని సోమవారం ఉదయం భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ (ఎంఎన్‌ఆర్‌ఈ) కార్యదర్శి దీపక్‌గుప్త ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యుత్తు లభ్యతలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సౌరశక్తిని వినియోగించడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ, జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సోలార్‌ మిషన్‌ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం)లు పర్యావరణ పరిరక్షణకోసం సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయని, అందుకయ్యే ఖర్చులో 30 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌లో 100 కేడబ్ల్యూపీ సోలార్‌ రూఫ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ. రెండు కోట్ల ముఫ్పై ఎనిమిది లక్షలు ఖర్చు కాగా ప్రభుత్వం రూ.70 లక్షలు సబ్సిడీగా ఇచ్చిందన్నారు.

ఐమ్యాక్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని కళాశాలలు, ఆస్పత్రులు కూడా ఐమ్యాక్స్‌ను ఆదర్శంగా తీసుకుని సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టులను నెలకొల్పితే మంచి పరిణామమన్నారు. గౌరవ అతిథిగా హాజరైన నెడ్‌క్యాప్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందన్‌మిత్రా, రాష్ట్ర విద్యుత్తు విభాగం ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ మల్టీప్లెక్స్‌ ఏర్పాటుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ సంస్ధ, మరో అడుగు ముందుకేసి దక్షిణ భారతంలో తొలి సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేశారన్నారు. ఇదే తీరును రాష్ట్రమంతా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

సినీ నటులు అక్కినేని నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఐమ్యాక్స్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఈ రోజుల్లో ఈ ప్లాంటుల ఏర్పాటు అవసరమన్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తక్కువగా ఉందని, దాన్ని మరింతగా పెంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఐమ్యాక్స్‌ అధినేత రమేష్‌ప్రసాద్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతతో పాటు నేడు ఇంధన ధరలు పెరుగుదలతో చూస్తే సోలార్‌ విధానం మంచిదని భావించి ఏర్పాటుచేశామన్నారు. థియేటర్‌లో తాము వినియోగిస్తున్న విద్యుత్తులో పది శాతం సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot