పార్ట్‌టైం ఉద్యోగం పేరిట గర్బిణీని మోసం చేసిన నేరగాళ్లు.. ఏకంగా రూ.54 లక్షలు దోపిడీ..!
భారత్‌లో ఇటీవల సైబర్ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక మంది బాధితులు లక్షల రూపాయలను కోల్పోతున్నారు. తాజాగా నేవీ ముంబైకి (Pregnant lost RS54 lakhs in Online Scam Navi Mumbai) చెందిన గర్భిణి ఏకంగా 54 లక్షల రూపాయలను కోల్పోయారు. మెటర్నిటీ సెలవులో ఉన్న మహిళ అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేసి నేరగాళ్ల చేతితో మోసపోయారు.
నేవీ ముంబై సైబర్ పోలీసుల కథనం ప్రకారం.. 37 సంవత్సరాల మహిళ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉంది. అయితే అదనపు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఓ వ్యక్తి ఆమెకు పార్ట్‌టైం ఉద్యోగం ఇచ్చారు. సంస్థలు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వాలని సూచించారు.

అధికంగా డబ్బు సంపాదించవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. దీంతో ఆమె తన పని ప్రారంభించింది. అనంతరం తమతో పెట్టుబడులు పెట్టాలని.. అధికంగా సంపాదించవచ్చని సూచించారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన సదరు మహిళ.. విడతల వారీగా నేరగాళ్ల ఖాతాకు ఏకంగా రూ.54,30,000 బదిలీ చేసింది.
ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కాలంలో ఈ నగదును నేరగాళ్ల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసింది. అయితే నేరగాళ్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసిన మహిళ.. తన డబ్బును వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కాల్స్ సహా మెసెజ్‌లకు స్పందించడం నేరగాళ్లు ఆపేశారు.
దీంతో మోసపోయానని గుర్తించిన మహిళ నేవీ ముంబైలోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రాం వంటి ప్లాట్‌ఫాంల ద్వారా సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నారు.
*ఇటీవలే ముంబైకు చెందిన సీబీఐ అధికారిని మోసం చేసి రూ.2 లక్షలు దోచుకున్నారు. సీబీఐ ముంబై కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారుల పేరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు చెందిన ఆశిష్ శర్మగా పరిచయం చేసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీబీఐ అధికారి పేరుతో పార్శిల్ వచ్చిందని తెలిపారు. అయితే పార్శిల్ డెలివరీని నిలిపివేసినట్లు తెలిపారు.
విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్న పార్శిల్‌లో ఎనిమిది పాస్‌పోర్టులు, ఐదు బ్యాంకు క్రెడిట్ కార్డులు, 170 గ్రాముల మెఫెడ్రోన్ మరియు కొంత నగదు ఉందని సదరు సీబీఐ అధికారికి వాట్సాప్ కాల్ చేసి వ్యక్తి తెలియజేశాడు. దీంతో అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా సుమారు 49 నిమిషాల పాటు ఆ వాట్సాప్ కాల్ సాగినట్లు సమాచారం.
తర్వాత రోజు అదే సీబీఐ అధికారికి ఢిల్లీ పోలీసుల పేరిట మరో ఫోన్ కాల్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొనాలని, రూ.2 లక్షలు చెల్లించాలని సీబీఐ అధికారికి తెలిపారు. నగదు తిరిగి చెల్లిస్తారని చెప్పి సీబీఐ అధికారి నుంచి తమ ఖాతాకు నేరగాళ్లు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన ముంబైకి చెందిన సీబీఐ అధికారి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications








