డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలను ఇలా గుర్తించండి.. వీడియో విడుదల చేసిన ప్రభుత్వం!
ప్రస్తుతం టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీ కారణంగా ఎంత మంచి జరుగుతుందో కొన్ని సార్లు అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాలను ప్రభావితం చేస్తుంటే.. AI ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీ (Deepfake) దుర్వినియోగం అవుతోంది.
ఇటీవల కాలంలో ఈ డీప్ పేక్ టెక్నాలజీ ఎంతో మంది అవస్థలకు గురిచేసింది. మరియు సైబర్ నేరగాళ్లకు ఈ టెక్నాలజీ వరంలా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం తరంలో పెద్ద ఆవిష్కరణగా భావిస్తున్న నేపథ్యంలో అదే టెక్నాలజీ కొన్ని ప్రమాదాలకు కారణం అవుతోంది. దీంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చాలా మంది అవస్థలు పడుతున్నారు.

ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకోసం ఇటీవల కొన్ని సూచనలతో కూడిన నోట్‌ను కూడా జారీ చేసింది. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై సోషల్ మీడియా సంస్థలను అప్రమత్తం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau Fact Check Team) ఓ వీడియోను విడుదల చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ (Artificial intelligence Deepfake) ద్వారా రూపొందించిన ఫోటోలను గుర్తించేందుకు వీలుగా కొన్ని సూచనలు చేసింది. ఎటువంటి ఇతర టెక్నాలజీ అవసరం లేకుండా డీప్ ఫేక్ ఫోటోలు గుర్తించేందుకు వీలుగా ఓ వీడియోను విడుదల చేసింది.
సాధారణ ఫోటోలతో పోలిస్తే ఈ డీప్‌ఫేక్ ఫోటోల్లో అసహజంగా ఉండే లైటింగ్, వ్యకుల నీడ ద్వారా కూడా గుర్తించవచ్చని తెలిపింది. జాగ్రత్తగా గమనించడం ద్వారా నకిలీ ఫోటోలను గుర్తించవచ్చని తెలిపింది.
దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేట్ ద్వారా ఎడిట్ చేసిన ఫోటోల్లో వ్యక్తుల తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుందని తెలిపింది. వారి కాలి వేళ్లు, చేతి వేళ్లు అసహజంగా కనిపిస్తాయని వీడియో ద్వారా తెలియజేసింది.
హెయిర్, శరీర ఆకృతి, చర్మం మరియు ఫ్యాబ్రిక్ టెక్చర్ ద్వారా గుర్తించవచ్చని తెలిపింది. వీటిని జాగ్రత్తగా పరీశీలించడం ద్వారా నకిలీ ఫోటోలను గుర్తించవచ్చని పేర్కొంది. కళ్లు, కనుబొమ్మలు (eyebrows), పెదాలు సహా ఇతర ముఖ కవళికల ద్వారా కూడా గుర్తించవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉదాహరణలను వీడియో ద్వారా షేర్ చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియోను షేర్ చేసింది. దీనిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. PIB కు ధన్యవాదాలు చెబుతున్నారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టేందుకు వీలుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిసెంబర్ 2019లో ఈ ప్యాక్ట్ చెక్ విభాగాన్ని ప్రారంభించింది.
సోషల్ మీడియా సహా ఇతర ఆన్‌లైన్ వేదికల్లో ప్రభుత్వ విధానాలు మరియు పథకాలు సహా ఇతర ప్రజాప్రయోజనాలకు సంబంధించిన తప్పుడు వార్తలను గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేస్తోంది. ఇందులో భాగంగా అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్న డీఫ్‌ఫేక్ టెక్నాలజీపై వీడియోను రూపొందించింది.


Click it and Unblock the Notifications








