మరోసారి గ్రహాంతరవాసులు అలజడి!

Posted By: Staff

మరోసారి గ్రహాంతరవాసులు అలజడి!

 

కాలిఫోర్నియా: అంగారకుడి పై అన్వేషణ సాగిస్తున్న నాసా రోవర్ క్యూరియాసిటీకి తాజాగా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఓ శిల తారపడటంతో గ్రహాంతరవాసుల అలజడి మరోసారి తెరపైకి వచ్చింది. ఫుట్ బాల్ పరిమాణంలో ఉన్న ఆ రాయి ఇంచుమించు పిరిమిడ్ ఆకారంలో ఉండటమే ఈ వాదనలకు దారితీసింది. ఇంతకీ పిరమిడ్‌కు  గ్రహాంతరవాసుల మధ్య ఉన్న సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా..?, ఈజిప్టులోని అత్యంత భారీ పురాతన పిరమిడ్లను మానవమాత్రులు నిర్మించలేరని, గ్రహాంతరవాసులే వాటిని ఏర్పాటు చేసి ఉంటారన్నది ఓ బలమైన వాదన. అయితే, ఈ వాదనను నిరూపించేందుకు ఇప్పటివరకు ఏలాంటి ఆధారాలు లభ్యంకాలేదు.

నాసా రోవర్ దృష్టిలోపడిన ఆ రాయి పిరమిడ్ ఆకృతిని కలిగి ఉండటంతో ఈజిప్టు పిరమిడ్ల పై ఉన్న ఏలియన్ సిద్ధాంతం మరోసారి చర్చనీయాంశమైంది. వీటిని బట్టే ప్రాచీనకాలంలో భూమిపైనా పిరమిడ్లను నిర్మించారేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం క్యూరియాసిటీ కనుగొన్న రాయి 25సెంటీమీటర్ల ఎత్తు ఉంది. ఇటీవలే మరణించిన నాసా శాస్త్రవేత్త 'జేక్ మాటిజెవిక్' పేరును దీనికి పెట్టారు. నిజానికి మూడు భౌగోళిక పరిస్థితుల కలయిక గల 'గ్లెనెల్గ్' అనే ప్రాంతానికి క్యూరియాసిటీ పరిశోధన నిమిత్తం ప్రయాణిస్తోంది.

ఈ క్రమంలోనే పిరమిడ్‌లాంటి శిల మార్స్ రోవర్‌కు కనిపించడంతో దీన్ని అధ్యయనం చేయాలని నాసా నిర్ణయించింది. లేజర్ ప్రయోగంతో ఈ రాయిలోని ఖనిజాల వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించనుంది. అయితే, ఈ శిలకు ఎలాంటి ప్రత్యేకత లేదని, అగ్నిపర్వతం నుంచి వచ్చిపడిన రాయిగానే భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వాయువుల ఒరిపిడి వల్లే ఈ రాయికి పిరమిడ్ ఆకారం వచ్చిందని వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting