ATM యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు మంట.. సామాన్యుడికి మరో షాక్!
ATM withdrawal: ATMలు వాడుకునే సామాన్య ప్రజలకు చేదు వార్త. త్వరలో ATM నుంచి డబ్బులు తీసుకోవాలంటే కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ATM విత్‍డ్రా ఛార్జీలను పెంచే యోచనలో ఉంది. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, మీరు కట్టే ఛార్జీలతో పాటు, బ్యాంకులు ఒకదానికొకటి వసూలు చేసుకునే ఇంటర్‍ఛేంజ్ ఫీజులు కూడా పెరుగుతాయి. అంటే, ATM వాడకం మరింత ప్రియం కానుంది.
* ఇప్పటి రూల్స్..
ప్రస్తుతం, ప్రతినెలా సొంత బ్యాంకు ATMలలో ఐదు సార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే, ఒక్కో లావాదేవీకి రూ.21 చొప్పున ఛార్జీ పడుతోంది. ఇంకా, వేరే బ్యాంకు ATM వాడుకుంటే, బ్యాంకు ఆ బ్యాంకుకు ఇంటర్‍ఛేంజ్ ఫీజు కడుతుంది. ఇది క్యాష్ విత్‍డ్రాకు రూ.17, బ్యాలెన్స్-చెక్ లాంటి నాన్-క్యాష్ లావాదేవీలకు రూ.6గా ఉంది.

* కొత్తగా ఏం మారుతున్నాయి..
ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, మీరు కట్టే ఛార్జీ రూ.21 నుంచి రూ.22కు పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు, క్యాష్ విత్‍డ్రా చేసుకుంటే బ్యాంకులు కట్టే ఇంటర్‍ఛేంజ్ ఫీజు రూ.17 నుంచి రూ.19కి, నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్లకు రూ.6 నుంచి రూ.7కు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంకా ప్రతిపాదనలే, RBI ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
* ఇంటర్‍ఛేంజ్ ఫీజు అంటే..
సులభంగా చెప్పాలంటే, మీరు SBI కస్టమర్ అయ్యుండి HDFC ATMలో డబ్బులు తీసుకున్నారనుకోండి. అప్పుడు SBI బ్యాంకు, HDFC బ్యాంకుకు ఒక ఛార్జీ కడుతుంది. దీన్నే ఇంటర్‍ఛేంజ్ ఫీజు అంటారు. ATM ల మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఇది కూడా ఒక భాగం. అందుకే ఈ ఫీజు పెరిగితే, సహజంగానే కస్టమర్ల మీద కూడా భారం పడుతుంది.
* ఎవరి జేబుకు చిల్లు..
నెలకి ఐదుసార్లు కంటే ఎక్కువ ATM వాడేవాళ్లందరికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. సిటీలో ఉన్నా, పల్లెటూర్లో ఉన్నా తేడా లేదు, అందరికీ ధరలు పెరుగుతాయి. బ్యాంకులు, ATM ఆపరేటర్లు కొత్త ఛార్జీలకు సై అన్నారట. కాబట్టి, RBI కూడా ఓకే అంటే ఇక అంతే సంగతులు.
* మీ మీద దీని ఎఫెక్ట్
మీరు ఎక్కువసార్లు ATM వాడితే, ఎక్కువ డబ్బులు కట్టాలి. ఇంతకుముందు వేరే బ్యాంకు ATMలో బ్యాలెన్స్ చూసుకోవడానికి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు దానికి కూడా ఎక్కువ ఛార్జీ పడుతుంది. నెలకు చాలాసార్లు ATM వాడేవాళ్లు మాత్రం తమ బ్యాంకింగ్ ఖర్చులు పెరగడానికి రెడీగా ఉండాల్సిందే.
* మరి ఏం చేయాలి..
కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రీ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. చిన్న అవసరాలకు ATMకు వెళ్లకుండా UPI, నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ వాడాలి. ఒక్కసారి పెద్ద మొత్తం విత్‍డ్రా చేసుకోండి, చిన్న మొత్తాల్లో తీసుకోవడం మానేయండి. లావాదేవీలను తెలివిగా మేనేజ్ చేసుకుంటే అనవసర ఖర్చులకు బ్రేక్ వేయవచ్చు.


Click it and Unblock the Notifications








