ఇల్లును అమ్మేస్తున్న అనిల్ అంబానీ, అప్పులు తీరేనా ?
అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. గుట్టలా పేరుకుపోయిన అప్పులను తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయం 'రిలయన్స్ సెంటర్’ను విక్రయించడమో లేదా అద్దెకివ్వడమో చేయాలనే నిర్ణయానికొచ్చినట్లుగా తెలుస్తోంది.తద్వారా సమకూరే నిధులను రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉపయోగించుకోనున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడించింది.

లీజు ప్రక్రియలో తోడ్పడేందుకు జోన్స్ లాంగ్ లాసాల్లే (జేఎల్‌ఎల్)ను కన్సల్టెంట్‌గా నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.

చట్టపరమైన వివాదాలు
మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీకోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్‌ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ డీల్ ద్వారా రూ.1,500-2,000 కోట్లు సమకూరవచ్చని అంచనా. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి వాహన ప్రయాణంలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను 15 నిమిషాల్లో, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం రిలయన్స్ సెంటర్‌లోని సిబ్బందిని గ్రూపునకు నగరంలో ఉన్న ఇతర కార్యాలయాలకు తరలించనున్నట్లు ఆర్‌ఇన్‌ఫ్రా వెల్లడించింది.

మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగానే
కాగా 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. మార్చి 2018 నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రాపై రూ.6,000 కోట్ల రుణభారం ఉంది.

కుప్పకూలిన సామాజ్ర్యం
11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. దివాలా కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ.57,500 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2005 లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు (అన్న ముకేశ్ అంబానీ) తమలో తాము విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్ అంబానీకి ఈ కార్యాలయం లభించింది.

2020 చివరినాటికి రుణరహిత కంపెనీగా..
2020 చివరినాటికి రుణరహిత కంపెనీగా మారాలనుకుంటున్నట్లు ఆర్‌ఇన్‌ఫ్రా పేర్కొంది. గత ఏడాదిలో ఆర్‌ఇన్‌ఫ్రా ముంబైలోని తన విద్యుత్ సరఫరా వ్యాపారాన్ని అదానీ ట్రాన్స్‌మిషన్‌కు రూ.18,800 కోట్లకు విక్రయించింది. తద్వారా రుణ భారాన్ని రూ.22,000 కోట్ల స్థాయి నుంచి భారీగా తగ్గించుకోగలిగింది.

జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటకు
ఇదిలా ఉంటే అవసరమైతే ఆస్తులను విక్రయించైనా సరే రుణాలు తిరిగి చెల్లిస్తానని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే రిలయన్స్ గ్రూపు వేగంగా పావులు కదుపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఎరిక్సన్ కంపెనీకి అనిల్ అంబానీ బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ చెల్లించిన సంగతి తెలిసిందే. దీంతో అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆర్ కామ్ టెలికాం నెట్ వర్క్ సేవల నిర్వహణ కోసం ఆ సంస్థతో ఎరిక్సన్ 2014లో ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications








