మరో సునామిని తలపించిన జియో మీటింగ్, హైలెట్స్ ఇవే
రిలయన్స్ 42వ వార్షిక సమావేశం మరో సునామిని తలపించింది. ఈ సమావేశంలో జియో అధినేత పలు కీలక ప్రకటనలు చేశారు. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీంతో పాటు జియఫోన్ 3 మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. RIL AGM 2019 Live హైలెట్స్ పై ఓ లుక్కేయండి.

ప్లాన్ వివరాలు ఇవే, 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ప్లాన్స్ ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి.

సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడవచ్చు
అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ గిగాఫైబర్‌తో సాధ్యమవుతుందని అంబానీ తెలిపారు.జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడవచ్చు.

మీటింగ్ హైలెట్స్ ఇవే
1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్
2. ప్రతిఒక్కరికి అందుబాటులోకి డిజిటల్ నెట్‌వర్క్
3. సెప్టెంబర్ 5 నాటికి జియో ఆవిష్కరించి 3 మూడేళ్లు
4. త్వరలోనే అందుబాటులోకి జియో బ్రాడ్‌బ్యాండ్
5. 1600 పట్టణాల్లో 20 మిలియన్ల మందికి బ్యాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
6. హోం బ్రాడ్ బ్యాండ్, 100జీబీ ఇంటర్నెట్, యూహెచ్‌డీ సెటాప్‌బాక్స్
7. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సర్వీసులు
8. రిలయన్స్ జియో ఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్
9. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు

జియో ఫోన్ 3
దేశీయ మొబైల్ మార్కెట్లోకి మరో సంచలన ఫోన్ జియో ఫోన్ 3 వచ్చేసింది. మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏజీఎం మీటింగ్‌లో రూ.2,999 ధరతో జియో ఫోన్2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్3ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. దీని ధర రూ.4,500 ఉండొచ్చని తెలిపారు. మరికొద్ది రోజల్లోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

జియో ఫోన్3 ప్రత్యేకతలివే
4జీ స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న జియో ఫోన్3ని మీడియా టెక్ చిప్‌సెట్‌తో తయారుచేశారు. గతంలో వచ్చిన జియో ఫోన్లకు క్వాల్కమ్, యూనిసాక్ చిప్‌సెట్‌లు వాడగా తాజా ఫోన్‌కు మాత్రం మీడియాటెక్ టెక్నాలజీ వాడారు. ఇది కాయ్(KAI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో, జియో2 ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జియో3 ఫోన్‌లో వీటన్నింటినీ అప్‌డేట్ చేయడమే కాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫోన్ Media Tek ప్రాసెసర్‌తో జియో ఫోన్ 2కు అప్ గ్రేడ్ వెర్షన్‌గా ప్రత్యేక ఆకర్షణతో నిలువనుంది. జియో ఫోన్ 2 కన్నా ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

అత్యధిక వేగవంతమైన డిజిటల్ ఫ్లాట్ ఫాం
ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన డిజిటల్ ఫ్లాట్ ఫాంగా రిలయన్స్ జియో నిలిచిందని, రెండో అతిపెద్ద నెట్ వర్క్ గా జియో ఇప్పుడు ఉందని ఆయన తెలిపారు. రీటైల్ రంగంలో రిలయన్స్ 1లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసిందన్నారు. భారత్ లో అత్యధిక పన్నులు చెల్లించింది రిలయన్స్ మాత్రమేనని తెలిపారు.

అతిపెద్ద విదేశీ పెట్టుబడులు
రిలయన్స్ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని,పెట్రో కెమికల్స్ రంగంలో సౌదీ అరాంకో-రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్ లో విదేశీ పెట్టుబడుల్లో 20శాతం వాటా రిలయన్స్ లో ఉంటుందన్నారు. పెట్రో కెమికల్ కింద రూ.5.7లక్షల కోట్ల ఆదాయం వస్తుందని జియో అధినేత తెలిపారు.

2018 ఆగస్ట్‌లోనే గిగాఫైబర్ సర్వీస్
కాగా రిలయెన్స్ జియో 2018 ఆగస్ట్‌లోనే గిగాఫైబర్ సర్వీస్‌ను ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అందిస్తున్నామని జియో అధినేత ఈ సమావేశంలో తెలిపారు. గిగాఫైబర్ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవల్ని రిలయెన్స్ జియో అందిస్తోంది. దేశ వ్యాప్తంగా 20 మిలియన్ ఇళ్లకు గిగాఫైబర్ సేవలు అందించేలా రిలయెన్స్ జియో ప్రణాళికలు రూపొందిస్తోంది .


Click it and Unblock the Notifications








