భవిష్యత్తు మీ అరచేతిలో.. శామ్‌సంగ్ 'బాల్లీ' రోబో వచ్చేస్తోంది..
గుర్తుందా, 2020 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో శామ్‌సంగ్ పరిచయం చేసిన చిట్టి రోబో బాల్లీ (Ballie)? ఇన్నాళ్లకు అది నిజం కాబోతోంది. ఇక మీ ఇల్లు చుట్టూ తిరుగుతూ పనులు చేసే ఈ అద్భుతమైన AI రోబో 2025లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది.
గత సంవత్సరం, 2024లో శామ్‌సంగ్ ఈ బాల్లీకి అదిరిపోయే అప్‌గ్రేడ్ ఇచ్చింది. ఇందులో ఒక ప్రొజెక్టర్ కూడా అమర్చారు. దీంతో గోడలపై మీకు నచ్చిన కంటెంట్, ముఖ్యమైన సమాచారాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు, లాస్ వెగాస్‌లో జరుగుతున్న CES 2025లో బాల్లీ ఈ సంవత్సరమే అమెరికాలో విడుదల కానుందని శామ్‌సంగ్ ప్రకటించింది.

* ప్రదర్శనలో అదరగొట్టింది
ధర, విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోయినా, CES 2025 ప్రదర్శనలో బాల్లీ తన సత్తా చాటింది. వాల్-ఈ (WALL-E) రోబోలా కనిపించే ఈ డివైజ్, లాస్ వెగాస్‌లోని ముఖ్యమైన స్థలాల గురించిన సమాచారం ఇవ్వగలదు. అంతేకాదు, మీ ఇంటిలోని స్మార్ట్ లైట్లు వంటి పరికరాలను మీ మాటలతోనే కంట్రోల్ చేస్తుంది. ఇక గోడలపై సినిమాలు కూడా చూడొచ్చు. ప్రదర్శనలో భాగంగా 'అన్‌చార్టెడ్' (Uncharted) సినిమాను గోడపై ప్రొజెక్ట్ చేసి చూపించారు.
బాల్లీలోని ప్రొజెక్టర్ చాలా తెలివైనది. "స్క్రీన్ పెద్దది చేయి" అని అడిగితే చాలు, వెంటనే మరో గోడను వెతికి అక్కడ పెద్దగా సినిమాను చూపిస్తుంది. సంగీతం కోసం ఇందులో స్పీకర్లు కూడా ఉన్నాయి.
బాల్లీ కేవలం మాటలతోనే కాదు, కెమెరాలు, సెన్సార్లతో ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, మీ కాలుతో 'వర్చువల్ బటన్ (Virtual button)' నొక్కడం. అవును, మీ కాలుతో నేలపై కనిపించే బటన్‌ను నొక్కి, మీ ఛాయిస్ కన్ఫామ్ చేయొచ్చు లేదా మరింత సమాచారం కోసం అడగవచ్చు.
ఒక ప్రదర్శనలో, స్టీక్‌తో ఏ వైన్ బాగుంటుందో తెలుసుకోవడానికి బాల్లీ సహాయం చేసింది. మీరు వర్చువల్ బటన్ నొక్కి, తగిన వైన్ గురించి అడిగి తెలుసుకోవచ్చు.
* అమెజాన్ ఆల్రెడీ తీసుకొచ్చేసింది
ఇలాంటి హోమ్ రోబోలపై ప్రయోగాలు చేస్తున్నది శామ్‌సంగ్ ఒక్కటే కాదు. అమెజాన్ 'ఆస్ట్రో' రోబోను కూడా తీసుకొచ్చింది. ఇది అలెక్సా సహాయంతో ఇంటి చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఇది ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది, దీని ధర సుమారు 1,600 డాలర్లు (సుమారు రూ.1.38 లక్షలు) ఎల్‌జీ కూడా గత CES ఈవెంట్లలో హోమ్ రోబోలను ప్రదర్శించింది కానీ అవి ఎప్పుడు వస్తాయో తెలియదు.
ఇక యాపిల్ కూడా స్మార్ట్ హోమ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోందట. త్వరలోనే, బహుశా మార్చిలోనే కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తులను విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, సినిమాలు ప్రొజెక్ట్ చేసే సామర్థ్యం, సెన్సార్లతో స్పందించడం, స్మార్ట్ పరికరాలను నియంత్రించడం వంటి ఫీచర్లతో బాల్లీ 2025లో హోమ్ రోబోటిక్స్‌ను కొత్త పుంతలు తొక్కించనుంది అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








