టార్గెట్ 60%..అంచనాల్లో మెగా ‘బ్రాండ్’!

Posted By: Super

టార్గెట్ 60%..అంచనాల్లో మెగా ‘బ్రాండ్’!

 

హైదరాబాద్: భారత స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో డిసెంబర్‌లోగా 60 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ప్రస్తుతం ఇందులో తమకు 46 శాతం వాటా ఉందని శామ్‌సంగ్ ఇండియా కంట్రీహెడ్(మొబైల్, ఐటీ బిజినెస్) రంజిత్ యాదవ్ తెలిపారు. ‘గెలాక్సీ ఎస్-3’ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కార్యక్రమంలో భాగంగా యాదవ్ మాట్లాడారు. భారత్‌లో స్మార్ట్ ఫోన్‌ల విక్రయాల సంఖ్య ఏడాదికి సుమారు కొటి ఉండగా పెరిగిన వినియోగం నేపధ్యంలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్ఫష్టం చేశారు.

డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనపడుతుండటం వల్ల మొబైల్ ఫోన్ల ధరలు పెంచాలా వద్దా అనే అంశంపై ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ధరలు తగ్గుతాయని కానీ, పెరుగుతాయని కానీ చెప్పడం కష్టమన్నారు. శామ్‌సంగ్ నుంచి నెలకు 2-3 కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొబైల్ ఫోన్లలో బేసిక్ మోడళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు అన్ని విభాగాల్లోనూ వృద్ధి నమోదవుతోందని, ఈ ఏడాది 5-10 శాతం వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. శామ్‌సంగ్ ఇంతకంటే వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పారు.

వారం ఆగండి.. ధరలు తగ్గుతాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నుంచి భారీ అంచానాలతో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3 భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో విడుదలైన విషయం తెలిసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను సామ్‌సంగ్ ఇండియా రూ. 43,180గా ప్రకటించింది. హై ప్రొఫైల్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనదలచిన వారు మరో వారం రోజులు ఓపిక పడితే సుమారు 3,500 తగ్గింపు ధరతో హ్యాండ్‌సెట్‌ను వసం చేసుకోవచ్చు. సామ్‌సంగ్ ఈ-స్టోర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను 42,500లకే ఆఫర్ చేస్తుంది.

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,000 కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్.కామ్ వారు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,900కు ఆఫర్ చేస్తుండగా, బుయ్‌ద‌ప్రైజ్.కామ్ ఈ ఫోన్ కొనుగోలు పై రూ.వెయ్యి విలువగల స్కల్‌క్యాండీ హెడ్‌ఫోన్‌లను ఉచితంగా అందిస్తోంది. ముంబయ్‌కు చెందిన మరో రిటైలింగ్ సంస్థ మహేష్ టెలికామ్ రూ.37,800కు గెలాక్సీ ఎస్3‌ని ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతానికి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రధాన రిటైల్ స్టోర్‌లలో మాత్రమే విక్రయిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot