అప్పుల సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్‌‌కు మళ్లీ షాక్, కలిసిరాని జియో మంత్రం

Written By:

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కష్టాల నావను దాటేందుకు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చడం లేదు. అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జియోకు ఆస్తుల అమ్మకంపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విక్రయం తన తుది ఆదేశానికి లోబడి ఉంటుందని కోర్టు తెలిపింది, తుది ఆదేశాలవరకు యథాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. తద్వారా తన అనుమతిలేనిదే ఈ డీల్‌ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బ్యాంకర్ల కన్సార్షియం అభ్యర్థన మేరకు స్పందించిన సుప్రీం కోర్టు ఆస్తుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్‌కామ్‌ను ఆదేశించింది. జస్టిస్‌ ఎకె గోయెల్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ యుయు లలిత్‌ సభ్యులుగా ఉన్న బెంచ్‌ ఆర్‌కామ్‌ ఆస్తుల విక్రయంపై బొంబాయి హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది.

నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.39వేల కోట్ల రుణభారాన్ని..

సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తన వైర్‌లెస్‌ స్పెక్ట్రం, టవర్, ఫైబర్‌, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్‌కాం ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్‌కు భిన్నంగా ముందస్తు అనుమతి లేకుండా దాని ఆస్తుల విక్రయం లేదా బదిలీకి కుదరదంటూ ఈ నెల 8న ముంబై హైకోర్టు ఈ డీల్‌ను తిరస్కరించింది.

ఎస్‌బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు..

ఎస్‌బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు ఆర్‌కామ్‌కు రుణాలివ్వడంతో అవన్నీ కూటమిగా ఏర్పడి ఆర్‌కామ్‌ కన్సాలిడేటెడ్‌ ఆస్తులను విక్రయించే ప్రక్రియను చేపట్టాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం, సెల్‌ టవర్లు, ఇతర సదుపాయాలను కొనుగోలు చేస్తానని రిలయన్స్‌ జియో ఆసక్తి చూపింది.

చిప్‌ మేకర్‌ ఎరిక్‌సన్‌..

అయితే ఆర్‌కాంనుంచి వెయ్యికోట్లకుపైగా బకాయి రావాల్సిన దేశీయ చిప్‌ మేకర్‌ ఎరిక్‌సన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆర్‌కాంకు మద్దతుగా నిలిచిన ఎస్‌బీఐ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తాజా ఆదేశాలిచ్చింది.

ఆర్‌కామ్, బ్యాంకుల కూటమి..

దీంతో ఆర్‌కామ్, బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతల తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, బ్యాంకులు ఇచ్చింది సెక్యూర్డ్‌ రుణాలు కనుక వారి క్లెయిమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

రూ.42,000 కోట్లు బకాయి

ఎరిక్సన్‌ తరఫు న్యాయవాది మాత్రం స్టే ఎత్తివేస్తే తాము బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఇది చాలా పెద్ద అంశం అయినందున, వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఆర్‌కామ్, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై తుది విచారణను ఏప్రిల్‌ 5న నిర్వహిస్తామని పేర్కొంది. కాగా ఆర్‌కామ్‌ బ్యాంకులకు రూ.42,000 కోట్లు బకాయి పడి ఉంది.

ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని..

సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని ఆర్‌కామ్‌ తెలిపింది. ఆర్‌బీఐ నిర్దేశించినట్టు ఆగస్ట్‌ 31లోపు తమ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

అప్పుల ఊబినుంచి బయటపడేందుకు..

కాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ( జియో) కు కంపెనీ ఆస్తులను విక్రయించాలని ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీ నిర్ణయించారు. అప్పుల ఊబినుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

17,300 కోట్ల రూపాయల డీల్‌..

ఆర్‌కామ్‌ చేతిలోని స్పెక్ట్రమ్‌, సెల్‌ టవర్లు, 1.78 లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ ఆప్టిక్‌ లైను, ఇతర మౌలిక వసతులను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ జియో 17,300 కోట్ల రూపాయల డీల్‌ కుదుర్చుకుంది. మరోవైపు ఈ ఆదేశాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో ఆర్‌కాం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 5శాతానికి పైగా నష్టపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
SC tells RCom, Reliance Jio to maintain status quo on asset sale plan More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot