రైల్వే షాకింగ్ నిర్ణయం తీసుకుందా.. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ప్రయాణికుల పరిస్థితి ఏంటి..!
భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో (indian Railway) ఒకటిగా ఉంది. ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంలో పోలిస్తే రైల్వేలో భారీ మార్పులు వచ్చాయి. రైళ్ల వేగంతోపాటు టికెట్ రిజర్వేషన్ విధానాల్లో మార్పులు వచ్చాయి. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త రైళ్లు, రైల్వే లైన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో కోచ్‌ల నిర్వహణ పైనా దృష్టిసారిస్తోంది.
గతంలో రైల్వే టికెట్ల కోసం స్టేషన్ టికెట్ కౌంటర్ల వద్ద వేచిచూడాల్సి వచ్చేది. అనంతరం IRCTC అందుబాటులోకి వచ్చాక.. టికెట్ల బుకింగ్ సులభమైంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం జనరల్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS (అన్‌రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌ను తీసుకొచ్చారు.

ఇటీవల రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో టికెట్ బుకింగ్ ముందస్తు గడువు 120 రోజులుగా ఉండేది. అంటే 120 రోజుల ముందుగానే రైలు టికెట్ ను బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. గత సంవత్సరం చివరలో ఈ ముందస్తు గడువును కుదించారు. కేవలం 60 రోజుల ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చారు.
దీంతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వేలో వివిధ సేవల కోసం అనేక యాప్, వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల బుకింగ్ కోసం IRCTC, అన్ రిజర్వడ్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం రైల్ మదద్, ట్రాకింగ్, కేటరింగ్ వంటి అవసరాల కోసం వివిధ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
ఈ యాప్‌ల సేవలను ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చే విధంగా రైల్వే కొత్త యాప్ "Swarail" అభివృద్ధి చేసింది. గత నెలలో ఈ యాప్ బీటా టెస్టింగ్ కోసం విడుదల చేసింది. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క యాప్ ద్వారా రైల్వేకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
అయితే తాజాగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ఆయా కోచ్‌లలో ప్రయాణించడానికి వీలు లేదని, ఇలా ప్రయాణం చేస్తే భారీగా జరిమానా విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్‌లు.. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే, చార్ట్ (ప్రయాణికుల జాబితా) తయారయ్యే సమయానికి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. అదే రైల్వే స్టేషన్ కౌంటర్‌లో తీసుకున్న టెకెట్‌లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా.. వాటితో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.
తాజాగా ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ప్రయాణం చేసేందుకు వీలులేదని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని మరియు జరిమానా చెల్లించిన అనంతరం తర్వాత స్టేషన్‌లో రైలు దిగిపోవాల్సి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఏసీలో వెయిటింగ్ లిస్ట్ టెకెట్‌పై ప్రయాణం చేస్తే రూ.440 జరిమానాతోపాటు మీరు ప్రయాణం చేసిన దూరానికి డబ్బులు చెల్లించాల్సి ఉందని.. అదే స్లీపర్ లో రూ.250 జరిమానాతోపాటు ప్రయాణించిన దూరానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అయితే పండుగలు, కుంభమేళా వంటి సమయాల్లో భారీ రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల మహాకుంభవేళా సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు మరణించారు. ఈ కారణంతో కొత్త నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులను రైళ్లలోకి అనుమతించరనే వార్తలపై రైల్వే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications








