ఇదండీ అమెజాన్ నిర్వాకం.. రూ.40 వేల కెమెరా ఆర్డర్ చేస్తే.. బాక్స్‌లో శూన్యం.. కస్టమర్ లబోదిబో..
Amazon missing camera: ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసేముందు ఒకటికి రెండుసార్లు కాదు, పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి కళ్లు తెరిపించే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఓ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. విషయంలోకి వెళ్తే, శుభమ్ అనే వ్యక్తి అమెజాన్‌లో ఏకంగా రూ.39,990 విలువైన కెమెరాను ఆర్డర్ చేశాడు.
అంతేకాదు, అదనంగా రెండు యాక్సెసరీలు కూడా ఆర్డర్ చేశాడు. కానీ డెలివరీ రాగానే బాక్స్ తెరిచి చూడగా, లోపల కెమెరా కనిపించలేదు. షాక్ తిన్న శుభమ్ వెంటనే తన గోడును సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అమెజాన్ స్పందనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే..
శుభమ్ గోప్రో హీరో 13 స్పెషల్ బండిల్ (ధర రూ.39,990), సివ్రో S11 ట్రైపాడ్ (ధర రూ.999), టెలిసెన్ ఎన్‌డి ఫిల్టర్లు (ధర రూ.2,812) కలిపి మొత్తం రూ.43,801 విలువైన వస్తువులను ఆర్డర్ చేశాడు. మూడు వస్తువులను ఒకేసారి పంపించారు. పార్సెల్ రాగానే అతని అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు తీసుకున్నాడు.
ఇంటికి వెళ్లాక శుభమ్ బాక్స్ తెరిచి చూడగా అందులో గోప్రో కెమెరా మాయం అయింది. భయాందోళన చెందిన శుభమ్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. ఫిబ్రవరి 4 నాటికి సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, ఆ తేదీ దాటినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు.
* చేతులెత్తేసిన అమెజాన్
పార్సెల్ డెలివరీ అయినట్లు చూపిస్తోందని, తాము ఏమీ చేయలేమని అమెజాన్ సిబ్బంది తేల్చి చెప్పేశారు. దీంతో శుభమ్ మోసపోయానని గ్రహించాడు. పార్సెల్ స్టిక్కర్‌పై 1.28 కిలోల బరువు ఉందని, కానీ తనకు వచ్చిన ప్యాకేజీ బరువు కేవలం 650 గ్రాములు మాత్రమే ఉందని గుర్తించాడు. అంటే దాదాపు సగం బరువు తగ్గిపోయింది.
కెమెరా లేకపోవడంతోనే బరువు తగ్గిందని అతడు వాపోయాడు. వెంటనే అమెజాన్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. శుభమ్ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది వినియోగదారులు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు పెట్టారు.
* నెటిజన్ల రియాక్షన్
ఒక యూజర్ కామెంట్ చేస్తూ, "నేను ఒకసారి రోబో వాక్యూమ్ ఆర్డర్ చేస్తే, బాక్స్ తెరిచి చూస్తే అందులో రెండు దిండ్లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ నేను అన్‌బాక్సింగ్ వీడియో తీశాను. అమెజాన్‌కు కంప్లైంట్ చేశాను. విచారణ తర్వాత నాకు పూర్తి డబ్బు తిరిగి వచ్చింది" అని తెలిపారు.
మరో యూజర్ "ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఎప్పుడూ ఓపెన్ డెలివరీ ఎంచుకోండి" అని సలహా ఇచ్చారు. "నేను ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు ఎప్పుడూ కొనను. షాపులో కొనడం ఎప్పుడూ సురక్షితం" అని మరొకరు అన్నారు. శుభమ్ ఘటన ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువులు మాయం అవ్వడం లేదా తారుమారు చేయడం వంటి సమస్యలపై పెరుగుతున్న ఆందోళనను తెలియజేస్తోంది.
ఖరీదైన వస్తువులకు ఓపెన్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తేవాలని చాలా మంది వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ శుభమ్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. వినియోగదారులకు రక్షించేలాగా మంచి చట్టాలు మరింత కట్టుదిట్టం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








