దూసుకుపోతున్న స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By: Staff

 దూసుకుపోతున్న స్మార్ట్‌ఫోన్‌లు!

 

ప్రపంచవ్యాప్త మొబైల్ అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్ల దూకుడు కొనసాగుతోంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికానికిగాను అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌ల అమ్మకాలు మూడు శాతం తగ్గినప్పటికి స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 47 శాతం పెరిగాయని పరిశోధన సంస్థ గార్టనర్ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. కొరియాకు చెందిన హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో యాపిల్ వాటాను క్రమంగా కైవసం చేసుకుంటున్నదని చెబుతున్నారు. సామ్‌సంగ్ అమ్మకాల్లో 39.6 శాతం స్మార్ట్‌ఫోన్లే ఆక్రమించాయి.

మూడో క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా 16.92 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయని ఆ నివేదిక తెలిపింది. 22.9 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ అతి పెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్ విక్రేతగా నిలవగా 19.2 శాతం వాటాతో నోకియా రెండో స్థానానికి దిగజారింది. గత ఏడాది సామ్‌సంగ్ మార్కెట్ వాటా 18.7 శాతం ఉండగా నోకియా వాటా 23.9 శాతం ఉంది. 5.5 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ సుదూరంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ వాటా 3.9 శాతం నుంచి పెరిగింది. సామ్‌సంగ్, నోకియా రెండూ కలిసి స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో 46.5 శాతం వాటా సాధించి మిగతా సంస్థలను దూరంగా నిలబెట్టాయని గార్టనర్ పేర్కొంది.

భిన్న ధరల శ్రేణుల్లో గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్ ఐదున్నర కోట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించగలిగిందని ఆ నివేదికలో తెలిపారు.సామ్‌సంగ్‌కు చెందిన ఇతర హ్యాండ్‌సెట్ల విక్రయాలు కూడా పెరిగాయని, మూడో త్రైమాసికంలో 9.8 కోట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించిందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అన్ని రకాల హ్యాండ్‌సెట్లు కలిపి అంతర్జాతీయంగా 42.8 కోట్ల యూనిట్లు అమ్ముడుపోయాయని తెలిపారు. అన్ని దేశాల్లోను పాత హ్యాండ్‌సెట్ల స్థానంలో మరింత అత్యాధునికమైన హ్యాండ్‌సెట్లను మార్చుకునే కస్టమర్ల కారణంగా అమ్మకాల్లో వృద్ధి ఏర్పడుతున్నదని కూడా ఆ నివేదిక పేర్కొంది.

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot