మీ బ్యాంక్ అకౌంట్‌కు పొరపాటున డబ్బు పంపామని.. తిరిగి ఇవ్వాలని కాల్స్ వస్తున్నాయా??
ఆన్‌లైన్ స్కామ్‌లు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. వివిధ మారాల్లో డబ్బులు దోచుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మీ ఖాతాలో పొరపాటున నగదు జమ చేశామని.. (Bank SMS Scam) తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని వెంటనే తమ డబ్బును వెనక్కి పంపాలని కోరుతున్నారు.
అయితే ఇలాంటి ఘటనల్లో కొన్ని సార్లు నిజంగానే నగదు బదిలీ జరిగి ఉండవచ్చు. అయితే ఎక్కువ శాతం ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండడం మినహా.. ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి అవకాశం లేదు.

అయితే ఈ తరహా మోసాలకు ఎలా పాల్పడుతున్నారంటే..
ది ఎకనామిక్స్ టైమ్స్ కథనం ఆధారంగా.. సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ నంబర్‌లో మీకు ఒక మెసేజ్ పంపుతున్నారు. మీకు ఖాతాకు నగదు జమ అయిందని దాని సారాంశం. అయితే వెంటనే ఓ కొత్త ఫోన్ నంబర్ నుంచి మీకో ఒక ఫోన్ వస్తుంది.
పొరపాటున మీ ఖాతాలో డబ్బులు వేశామని, వెంటనే తమ ఖాతాకు తిరిగి పంపాలను కోరతారు. తాము హాస్పిటల్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని వెంటనే డబ్బులు తాము చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు పంపాలని సూచిస్తారు. అయితే మీరు ఎటువంటి నిర్ధారణ లేకుండా నగదు బదిలీ చేస్తే.. నగదు పోవడం సహా మీ బ్యాంకు ఖాతా వివరాలు నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది.
అందువల్ల ఇటువంటి సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్లు వచ్చే మెసెజ్ లను పూర్తిస్థాయిలో పరిశీలించాలి. బ్యాంకులు ఎప్పుడు కూడా మొబైల్ నంబర్‌తో ఈ తరహా మెసేజ్‌లను పంపించవని గుర్తుపెట్టుకోవాలి.
బ్యాంకు ఖాతాలోకి నగదు వచ్చినా లేదా విత్‌డ్రా అయినా ప్రత్యేకమైన కోడ్‌తో కూడిన నంబర్ ద్వారా మెసెజ్ రూపంలో తెలియజేస్తాయి. దీంతోపాటు మొబైల్ లేదా ఇతర మార్గాల ద్వారా మీ ఖాతాలోకి నగదు వచ్చాయో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరమే మీ ఖాతాలోకి నిజంగా డబ్బులు పొరపాటున వచ్చినట్లయితే.. నగదును వెనక్కి పంపేందుకు ఆలోచించాలి.
ఈ తరహా తనిఖీలు చేయకుండా.. స్కామర్ల పంపిన నకిలీ మెసెజ్ ఆధారంగా వారికి డబ్బును తిరిగి పంపేందుకు ప్రయత్నం చేస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. తొలుత మీరు నగదును కోల్పోవడం కాకుండా.. మీ బ్యాంకు సహా ఇతర వివరాలు వారికి చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా భవిష్యత్‌లో సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది.
**బెంగుళూరు మహిళ ఇదే తరహా మోసానికి సంబంధించి X (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆమె పోస్టు ఆధారంగా.. ఓ రోజు ఆఫీస్‌లో ఉన్న సమయంలో ఓ ఫోన్ వచ్చింది. మీ నాన్నకు నగదు పంపాల్సి ఉందని.. మీ నంబర్‌కు పంపాలని అతను చెప్పినట్లు నేరగాళ్లు ఆమెను నమ్మించారు. అయితే కాల్ మాట్లాడుతున్న సమయంలోనే తమ ఖాతాకు నగదు జమ అయినట్లు బ్యాంకు వారు పంపిన ఫార్మాట్‌లో మెసెజ్ వచ్చింది.
అయితే వెంటనే కాల్‌లో మాట్లాడుతున్న వ్యక్తి.. మీ నాన్నకు రూ.3 వేలు మాత్రమే ఇవ్వాలి. పొరపాటున రూ.30,000 పంపించాం. వెంటనే తిరిగి పంపాలని కోరారు. తాను డాక్టర్ వద్ద ఉన్నానని తన డబ్బు వెంటనే తిరిగి పంపాలంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడే తనకు ఇదంతా స్కామ్ అని గుర్తించాలని చెప్పారు. వచ్చిన మెసెజ్‌ను తనిఖీ చేయగా.. సాధారణ మొబైల్ నంబర్ నుంచి ఆ మెసెజ్ వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారు.
అనంతరం బ్యాంకు బ్యాలెన్స్ తనిఖీ చేసి, అంతకు ముందు కాల్ వచ్చిన మొబైల్ నంబర్‌కు కాల్ చేసేందుకు ప్రయత్నం చేస్తే.. నంబర్ బ్లాక్ చేసినట్లు తెలిసిందని తెలిపారు. ఈ తరహా ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు బ్యాంకులోని నగదును తనిఖీ చేసిన తర్వాతే స్పందించాలని సూచించారు.


Click it and Unblock the Notifications








