నైపుణ్య లోపం కూడా భారత్‌ వృద్ధికి ఓ అడ్డంకే: ప్రపంచ బ్యాంక్‌

Posted By: Super

నైపుణ్య లోపం కూడా భారత్‌ వృద్ధికి ఓ అడ్డంకే: ప్రపంచ బ్యాంక్‌

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగంలో వృద్ధికి ప్రధాన ప్రతిబంధకాలలో ప్రావీణ్య లోపం అనేది ఒకటిగా ఉందని ప్రపంచ బ్యాంకు ఇటీవల వెలువరించిన ఒక పత్రం పేర్కొంది. 'భారత్‌లో కొత్తగా ఇంజినీరింగ్‌ పట్టాను పొందిన వారిలో ఉద్యోగ అర్హత, ప్రావీణ్య ప్రమాణాలు' అనే అంశంపై ప్రపంచ బ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. భారత దేశంలో దాదాపు 64 శాతం యాజమాన్య సంస్థలు ఇంజినీరింగ్‌ విద్యను ముగించుకొన్న నూతన పట్టభద్రుల నైపుణ్యాల పట్ల సంతృప్తి చెందడం లేదని ఈ పత్రం వివరించింది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పన వంటి మొత్తం 20 రంగాలకు చెందిన సంస్థల యాజమాన్యాల నుంచి ఈ వర్కింగ్‌ పేపర్‌ రచయితలు ఆండ్రియాస్‌ బ్లూమ్‌, హిరోషి సేకీలు అభిప్రాయాలను సేకరించారు. ఈ సంస్థలలో సగం సంస్థలు 500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న పెద్ద కంపెనీలు కావడం విశేషం. అలాగే 40 శాతానికి పైగా కంపెనీలు ఉత్తర భారత దేశానికి చెందినవి. మరో 27 శాతం కంపెనీలు పశ్చిమ రాష్ట్రాలు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నాయి. 19 శాతం కంపెనీల ప్రధాన కార్యకలాపాలు దక్షిణాది రాష్ట్రాలలో నెలకొన్నాయి.

ఎగువ స్థాయిలలో ఆలోచనా నైపుణ్యం తొణికిసలాడాల్సి ఉండగా లోటు కనిపిస్తోందని, కింది స్థాయిలో మాత్రం ఏమంత పెద్ద అంతరాలు లేవని వర్కింగ్‌ పేపర్‌ విశ్లేషించింది. కొత్త పట్టభద్రుల ఆంగ్ల భాషా సంభాషణ మెలకువలు మాత్రం తృప్తి కలిగించే విధంగా ఉన్నాయని పలు యాజమాన్య సంస్థలు వెల్లడించాయి. 2003-06 సంవత్సరాల మధ్య కాలంలో ఐటీ రంగంలో నైపుణ్య కొరత కారణంగా వివిధ సంస్థలు వేతనాలను 15 శాతం పెంచవలసి వచ్చిందని ప్రపంచ బ్యాంక్‌ పత్రం బయటపెట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot