భారతీయ రైల్వే నుంచి గుడ్‌న్యూస్.. పార్సిల్ బుకింగ్, డెలివరీల కోసం కొత్త యాప్..!
భారతీయ రైల్వే తన ప్రయాణికుల సౌకర్యం కోసం ఇటీవల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఇటీవల కొంత కాలంగా కీలక మార్పులు తీసుకొస్తోంది. రైల్వేలో అనేక సేవల కోసం గత సంవత్సరం రైల్ వన్ యాప్‌ను తీసుకొచ్చింది. జనరల్ టికెట్ల బుకింగ్, ప్లాట్‌ఫాం టికెట్లు, ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదుల కోసం ఈ యాప్‌ను లాంచ్ చేశారు. అయితే తాజాగా రైల్వే నుంచి మరో యాప్ అందుబాటులోకి వచ్చింది.
భారతీయ రైల్వేలో తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో రైల్ పార్సిల్ యాప్‌ను (Rail Parcel App) తీసుకొచ్చారు. దీన్ని తొలి డిజిటల్ పార్సిల్ లాజిస్టిక్స్ యాప్‌గా పేర్కొంది. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ అత్యంత సులభంగా పూర్తి చేసుకోవచ్చని జోన్ జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అన్నారు.

ఈ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు :
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చెన్నై, బెంగళూరులో ఈ యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పారు. ఈ యాప్‌తో ఇంటి నుంచే బుకింగ్, డెలివరీ, రియల్ టైమ్ ట్రాకింగ్ చేసుకోవచ్చని చెప్పారు.
భారతీయ రైల్వేలో పార్సిల్ సర్వీసులు ఎప్పటి నుంచో ఉన్నాయి, అయితే బుకింగ్, డెలివరీల కోసం ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే ఈ యాప్ విడుదలతో ఈ సర్వీసులు అన్నీ డిజిటల్ రూపంలోకి మారనున్నాయి. అయితే భారతీయ రైల్వేలో ఈ తరహా యాప్ తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే జోన్ తీసుకొచ్చిందని జీఎం తెలిపారు.
ఆర్‌ఏసీ టికెట్లపై కీలక సూచనలు :
రైల్వేలో RAC టికెట్లపై పార్లమెంటరీ కమిటీ కీలక సూచనలు చేసింది. RAC కింద టికెట్లు జారీ చేసి, పూర్తి ఛార్జి వసూలు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపింది. బెర్త్ లభించని ప్రయాణికులకు, కొంత మొత్తం చెల్లించాలని సూచనలు చేసింది.
పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో పార్లమెంట్‌కు ఈ నెల తొలివారంలో కమిటీ నివేదిక సమర్పించింది. రైల్వేలో RAC కింద ఒకే బెర్తును ఇద్దరికి కేటాయించి, వారిద్దరి నుంచి పూర్తి టికెట్ మొత్తం వసూలు చేస్తున్నారని నివేదికపై ప్రస్తావించింది. పూర్తి బెర్త్ లభించని వారికి కొంత మొత్తం తిరిగి ఇవ్వాలని, ఇందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని సూచనలు చేసింది.
ఫ్లాట్‌ఫాం, జనరల్ టికెట్ల బుకింగ్ కోసం రైల్వే గతంలో UTS యాప్‌ను తీసుకొచ్చింది. ఈ టికెట్ల కోసం భారీ క్యూ లైన్‌లో ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకొనే అవకాశం లభించింది. అయితే గత సంవత్సరం రైల్ వన్ పేరుతో మరో యాప్‌ను కూడా తీసుకొచ్చింది.
మార్చి 1 నుంచి ఈ యాప్ కనిపించదు.. :
రైల్ వన్ ద్వారా మరింత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా UTS యాప్‌ను నిలిపివేస్తున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చింది. ఇందుకు అనుగుణంగా మార్చి 1 నుంచి UTS యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. రైల్వే టికెట్ల బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్ యాప్‌తోపాటు రైల్ వన్ యాప్‌ను వినియోగించుకోవచ్చు.
అయితే రైల్ వన్ యాప్‌లో ఫుడ్ ఆర్డర్, సాధారణ టికెట్ల బుకింగ్, లైవ్ ట్రాకింగ్, PNR వివరులా తెలుసుకోవడం, ఫిర్యాదులు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మీకు ఇప్పటికే IRCTC లాగిన్ వివరాలు కలిగి ఉంటే, వాటి ద్వారానే రైల్‌వన్ యాప్‌లోనూ లాగిన్ కావచ్చు.
రైల్‌వన్ యాప్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా భారతీయ రైల్వే ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. జులై 14 వరకు రైల్‌వన్ యాప్‌లో డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేసే బుకింగ్స్‌పై 3 శాతం డిస్కౌంట్‌ను అందిస్తామని తెలిపింది. అంటే UPI, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్ ద్వారా చేసిన చెల్లింపులపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








