అందుబాటులోకి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. రీఛార్జ్ ప్లాన్‌లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు..!
శాటిలైట్ ఇంటర్నెట్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం SpaceX శాటిలైట్‌ల ద్వారా ఇంటర్నెట్ సేవలను ఎలాన్ మస్క్ (Starlink) అందిస్తున్నారు. భూ దిగువ కక్ష్యలోకి (LEO) ఉపగ్రహాలను పంపి అక్కడ నుంచే నేరుగా సర్వీసులను అందిస్తున్నారు. ఫలితంగా భూమి ఉన్న నెట్‌వర్క్ టవర్ల అవసరం లేకుండానే ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. సుమారు 7000 లకు పైనా శాటిలైట్‌లతో ఈ సర్వీసులను (Satellite internet) ఎలాన్ మస్క్ అందిస్తున్నారు. వరదలు సహా విపత్తుల సమయాల్లో ఈ తరహా ఇంటర్నెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సుమారు 100 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు :
ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ తన సేవలు సుమారు 100 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, UK, మంగోలియా సహా అనేక దేశాల ప్రజలు ఈ స్టార్‌లింక్ సేవలను పొందుతున్నారు. మన పక్క దేశం భూటాన్‌లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

తాజాగా అధికారిక ప్రకటన :
భూటాన్ దేశంలో డిసెంబర్ 2024 లోనే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ వివరాలను స్పేస్‌ఎక్స్ అధికారికంగా వెల్లడించింది. ఫలితంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలతోపాటు కొండలు, పర్వత ప్రాంతాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
రెండు రీఛార్జ్ ప్లాన్లు :
భూటాన్‌లో స్టార్‌లింక్ రెండు ఇంటర్నెట్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్, స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్‌ల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే సాధారణ ఇంటర్నెట్ సేవలతో పోలిస్తే వీటి ధరలు భారీగా ఉన్నాయి. అయితే ఈ రెండు ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
ధరలు, డేటా స్పీడ్ :
రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ ధర నెలకు Nu 3,000 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3,001) గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా డేటా వేగం 23 Mbps నుంచి 100 Mbps గా ఉంటుంది. స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ ధర Nu 4200 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.4201) గా ఉంది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు?
భారత్‌లోనూ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రత కారణాలతో ప్రభుత్వం ఎలాన్‌మస్క్‌కు చెందిన SpaceX సంస్థకు అనుమతులు మంజూరు చేయలేదు. కేంద్ర టెలికాం శాఖ స్టార్‌లింక్ లైసెన్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
మనకంటే పాక్‌లోనే ముందుగానే?
ఇండియా కంటే ముందుగానే పాకిస్తాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దేశంలో టెలికాం నిబంధనలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు వేగంగా అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లోనూ భవిష్యత్‌లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పాక్ మీడియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని లీక్స్ ఆధారంగా నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం 50 వేల పాకిస్తానీ రూపాయలను (భారత్ కరెన్సీ ప్రకారం రూ.15600) చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా డేటా వేగం 50 Mbps నుంచి 250 Mbps వరకు ఉంటుందని తెలుస్తోంది.
రెసిడెన్షియల్ ప్లాన్ కోసం రూ.35,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అదే బిజినెస్ ప్లాన్ కోసం నెలవారీ రూ.95,000 పాక్ కరెన్సీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్లా్న్‌లో భాగంగా 100 Mbps నుంచి 500 Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








