భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. షరతులతో స్టార్‌లింక్‌కు మరో కీలక లైసెన్స్ జారీ..!
Satellite internet Services in india : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ స్టార్‌లింక్‌కు భారత్ ప్రభుత్వం నుంచి కీలక అనుమతులు లభించాయి. ఈ సంవత్సరం జూన్‌లో టెలికాం విభాగం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి. అనంతరం జులై నెలలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (IN-SPACe) లైసెన్స్‌ను జారీ అయింది.
దేశీయ నిబంధనలకు స్టార్‌లింక్ అంగీకారం :
అయితే తాజాగా మరో కీలకమైన లైసెన్స్‌ను పొందింది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గానూ ప్రభుత్వం విధించిన అనేక నిబంధనలకు స్టార్‌లింక్ (Starlink) అంగీకరించినట్లు కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అందుకు అనుగుణంగా యూనిఫైడ్ లైసెన్స్ ను టెలికాం విభాగం జారీ చేసినట్లు తెలిపారు.

ఏంటా నిబంధనలు :
భారత ప్రభుత్వ భద్రత నిబంధనల ప్రకారం స్థానికంగా ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ యూజర్ల డేటాను విదేశాలకు రూటింగ్, డిక్రిప్ట్, కాపీ చేయకూడదని స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ :
భారతీయుల ట్రాఫిక్ విదేశాల్లోని ఏ సిస్టమ్/సర్వర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మిర్రర్ కాకూడదని స్పష్టం చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్ ధరలతోపాటు, స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలు మరియు షరతులపై టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుంచి టెలికాం విభాగం (DoT) సిఫార్సులను కోరిందని, అవి తమకు మే 9 న అందినట్లు మంత్రి చెప్పారు.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు రానున్న కాలంలో భారీ ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయని, ఈ రంగం ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ముఖ్యంగా ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపారు.
* ఇటీవలే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వివరాలను వెల్లడించారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి కేవలం 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే అందించగలదని తెలిపారు. గరిష్ఠంగా 200 Mbps వేగంతో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తుందన్నారు.
పరిమిత సంఖ్యలో కనెక్షన్‌ల కారణంగా భారత్‌లో ప్రస్తుతం ఉన్న సంస్థలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే నెలవారీ ఛార్జీలు తక్కువగా ఉన్నా.. ప్రారంభ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న వివరాలు, లీక్స్ ఆధారంగా భారత్‌లో నెలవారీ కనిష్ఠ ఛార్జీలు రూ.3 వేలుగా ఉండే అవకాశం ఉంది. అదే ఇన్‌స్టాలేషన్ సమయంలో హార్డ్‌వేర్ కొనుగోలు కోసం సుమారుగా రూ.33 వేలు చెల్లించాల్సి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 100 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తోంది. భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో (LEO) సుమారు 7000 పైగా ఉపగ్రహాలతో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








