BSNL యూజర్‌లకు గుడ్‌న్యూస్.. ఇప్పటివరకు 41,000 4G నెట్‌వర్క్ టవర్‌ల ఏర్పాటు.. పూర్తి వివరాలు..!
BSNL 4G నెట్‌వర్క్‌ను (BSNL 4G) దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష 4G నెట్‌వర్క్ టవర్ల నిర్మాణం చేపట్టాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కీలక మైలురాయికి చేరినట్లు సోషల్ మీడియా వేదికగా సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో 41,000 4G టవర్‌లను ఏర్పాటు చేసినట్లు X వేదికగా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దేశంలోని టెలికాం రంగంలో నాలుగో స్థానంలో ఉంది.
ఈ సంవత్సరం చివరి నాటికి 75000 4G టవర్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు గతంలోనే కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సిందియా వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో మిలిగిన టవర్ల ఏర్పాటు పూర్తి చేస్తామని చెప్పారు. దీంతోపాటు జూన్ 2025 నుంచి 5G నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి సిందియా వెల్లడించారు.

BSNL 5G నెట్‌వర్క్ కోసం ఇప్పటికే సన్నాహక ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అయితే మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు BSNL ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు లడఖ్ లోనూ 4G టవర్‌ను ఏర్పాటు చేసినట్లు గతంలోనే వెల్లడించింది. తాజా లెక్కల ఆధారంగా శరవేగంగా 4G టవర్‌ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా.. టెక్నాలజీని సమకూర్చుకుంది. దీంతోపాటు C-DoT కార్యాలయంలో 5G నెట్‌వర్క్ పనితీరును ఆ శాఖ మంత్రి జోతిర్యాధిత్య సిందియా పరిశీలించారు.
Another milestone achieved with 41,000 4G sites on air!
— BSNL India (@BSNLCorporate) October 29, 2024
The journey to bridge the digital divide reaches new heights as #BSNL expands 4G coverage across India, offering secure, reliable, and affordable connectivity.#ConnectingBharat #BSNL4G #SwadeshiNetwork #BharatKaApna4G pic.twitter.com/fQsTAqKVhX
ఈ సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VI)... భారీగా రీఛార్జ్ ధరలు పెంచాయి. దీంతో లక్షలాది మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గుచూపుతున్నాయి. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన TRAI గణాంకాలే ఇందుకు ఉదాహరణ. 4G, 5G నెట్‌వర్క్ త్వరలోనే అందుబాటులోకి రావడం సహా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉండడంతో BSNL ను ఎక్కువ మంది ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు భారీగా యూజర్‌లను కోల్పోతున్నాయి. ట్రాయ్ లెక్కల ఆధారంగా ఆగస్టు నెలలో జియో సుమారు 40 లక్షలు, ఎయిర్‌టెల్ సుమారుగా 24 లక్షలు, వోడాఫోన్ ఐడియా సుమారుగా 19 లక్షల యూజర్లను కోల్పోయాయి. అదే సమయంలో BSNL 25 లక్షల మంది యూజర్లను BSNL సంపాదించుకుంది. జులై నెలలోనూ 29 లక్షలకు పైగా యూజర్‌లు చేరారు.
BSNL గత వారం కొత్త లోగోను విడుదల చేసింది. దీంతోపాటు కొత్తగా 7 సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా BSNL CMD రాబర్ట్ రవి.. ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశారు. సమీప భవిష్యత్‌లో BSNL ఛార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీలు పెంచే అవసరం లేదని చెప్పారు. యూజర్ల విశ్వాసాన్ని పొందడమే తమ లక్ష్యమన్నారు.


Click it and Unblock the Notifications








