సంచలనం రేపుతున్న స్టీవ్ జాబ్స్ ఆత్మకథలోని విషయాలు

Posted By: Staff

సంచలనం రేపుతున్న స్టీవ్ జాబ్స్ ఆత్మకథలోని విషయాలు

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇటీవలే కన్నుమూసిన యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ తన ఆత్మకథలో బిల్‌గేట్స్ మొదలు గూగుల్ దాకా ప్రత్యర్థులందరి పైనా విమర్శలు చేశారు. ఐఫోన్, ఐప్యాడ్ ఐడియాలను దొంగిలించిందనే ఆరోపణలతో గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను నాశనం చేయాలనుకున్నట్లు పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్‌పై థర్మోన్యూక్లియర్ యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు మీ డబ్బు అక్కర్లేదు. మీరు 5 బిలియన్ డాలర్లు ఇస్తామన్నా నాకు అవసరం లేదు. నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది. కా నీ మా ఐడియాలను ఆండ్రాయిడ్‌లో ఉపయోగించడాన్ని వాళ్లు ఆపడమే నాకు కావాల్సింది’ అని జాబ్స్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

సోమవారం విడుదల కానున్న దీన్ని వాల్టర్ ఐజాక్‌సన్ రాశారు. ఇందులో నుంచి లీకయిన కొన్ని అంశాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కి అసలు సృజనాత్మకత లేదని, ఆయన ఏనాడు దేన్ని కూడా కనుగొనలేదని జాబ్స్ ఆత్మకథలో విమర్శించారు. అందుకే ఆయన ప్రస్తుతం టెక్నాలజీ కన్నా దాతృత్వంలోనే సౌఖ్యం వెతుక్కుంటున్నారన్నారు. బిల్‌గేట్స్ నిస్సిగ్గుగా ఇతరుల ఐడియాలను దొంగిలించారని జాబ్స్ ఆరోపించారు. కనీసం ఏదైనా ప్రయోగాలు చేసినా లేదా వయస్సులో ఉన్నప్పుడు ఏదైనా ఆశ్రమానికి వెళ్లి ఉంటేనైనా బిల్‌గేట్స్‌కి మరింత విశాల దృక్పథం అలవడి ఉండేదని జాబ్స్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఆరోపణలపై ఇంటర్నెట్‌లో అప్పుడే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. జాబ్స్ కూడా ఎంపీ3 ప్లేయర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను మెరుగుపర్చటం తప్ప ప్రత్యేకంగా చేసిందేమీ లేదంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరోవైపు, యాపిల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జొనాథన్ జానీ ఐవ్‌ను మాత్రం జాబ్స్ ప్రశంసించారు. యాపిల్‌లో తనకు ఆధ్యాత్మిక భాగస్వామి ఎవరైనా ఉంటే అది జానీయేనని ఆత్మకథలో జాబ్స్‌ను ఉటంకిస్తూ ఐజాక్‌సన్ పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot