ఇకపై మీ ఏరియాలో ఏ నెట్‌వర్క్ సిగ్నల్ ఎంతుందో తెలుసుకోవచ్చు.. జియో, ఎయిర్‌టెల్, Vi కవరేజ్ మ్యాప్స్ వచ్చాశాయ్!
Jio Airtel Vi coverage map: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) ఇప్పుడు తమ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాయి. ఇకపై సిమ్ తీసుకునే ముందే మీ ఏరియాలో సిగ్నల్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ - TRAI) ఆదేశాల మేరకే ఈ కంపెనీలన్నీ తమ వెబ్‌సైట్లలో ఈ ప్రాంతాల వారీ కవరేజ్ మ్యాప్‌లను పెట్టాల్సి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం, వినియోగదారులు తమ ప్రాంతంలో ఉన్న కవరేజ్‌ను బట్టి, ఏ మొబైల్ నెట్‌వర్క్ ఎంచుకోవాలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడటమే.

* నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లు ఎందుకంత ముఖ్యం..
ఇంతకుముందు, మన ఏరియాలో ఫలానా నెట్‌వర్క్ సిగ్నల్ సరిగ్గా వస్తుందో లేదో తెలియకుండానే సిమ్ కొనాల్సి వచ్చేది. దానివల్ల చాలామందికి సిగ్నల్ సరిగా లేకపోవడం, కాల్స్ మధ్యలో కట్ అవ్వడం (కాల్ డ్రాప్స్), ఇంటర్నెట్ నెమ్మదిగా రావడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.
కానీ ఇప్పుడు ఈ కవరేజ్ మ్యాప్‌ల ద్వారా, వినియోగదారులు తమకు కావాల్సిన చోట 2G, 3G, 4G లేదా లేటెస్ట్ 5G సేవలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవచ్చు. 2024, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ట్రాయ్ కొత్త సేవల నాణ్యత (Quality of Service) నిబంధనల్లో భాగంగా ఈ మార్పు వచ్చింది.
* ఈ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను ఎక్కడ చూడాలి?
జియో, ఎయిర్‌టెల్, Vi తమ అధికారిక వెబ్‌సైట్లలో వీటిని అందుబాటులో ఉంచాయి. వాటి లింకులు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్‌టెల్ (Airtel) వెబ్‌సైట్ కింది భాగంలో (footer) ఉన్న 'Help at Hand' సెక్షన్‌లో 'Check Coverage' అనే ఆప్షన్ కింద చూడొచ్చు. URL: airtel.in/wirelesscoverage
జియో (Jio) వెబ్‌సైట్ కింది భాగంలో (footer) ఉన్న 'Useful Links' సెక్షన్‌లో 'Coverage Map' అనే ఆప్షన్ కింద ఉంది. URL: jio.com/selfcare/coverage-map/. Vi (వొడాఫోన్ ఐడియా): 'Regulatory and Quick Access' సెక్షన్‌లో 'Network Coverage' అనే ఆప్షన్ కింద లభిస్తుంది. URL: myvi.in/vicoverage
* ఈ మ్యాప్‌లు ఎలా పనిచేస్తాయి?
మీరు మీ ప్రాంతం పేరు లేదా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు, అక్కడ అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ కవరేజ్‌ను ఇవి చూపిస్తాయి. వేర్వేరు నెట్‌వర్క్ రకాల (4G, 5G వంటివి) సిగ్నల్ బలాన్ని వివిధ రంగుల ద్వారా సూచిస్తారు. జియో, Vi మ్యాప్‌లు చాలా స్మూత్‌గా పనిచేస్తున్నాయి. దాదాపు సరైన వివరాలనే అందిస్తున్నాయి.
కానీ, నేషల్ మీడియా ఎయిర్‌టెల్ మ్యాప్‌ను నోయిడా సెక్టర్ 16 నుంచి టెస్ట్ చేసినప్పుడు, అక్కడ ఎయిర్‌టెల్ సిమ్‌లో 4G, 5G సిగ్నల్స్ రెండూ యాక్టివ్‌గా ఉన్నా, మ్యాప్‌లో మాత్రం ఎటువంటి కవరేజ్ చూపించలేదు. ఇది కొంచెం ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాప్స్ లో ఉన్న సమాచారం కచ్చితమైనదా కాదా అనే ప్రశ్నను లేవనెత్తింది.
* కవరేజ్ మ్యాప్‌ల పరిమితులు..
ఈ మ్యాప్‌లు నెట్‌వర్క్ లభ్యత గురించి ఒక సాధారణ అవగాహన కల్పిస్తున్నా ఇవి నూటికి నూరు శాతం కచ్చితమైనవి కావు, కేవలం ఒక అంచనా మాత్రమే అని గుర్తుంచుకోవాలి. నిజమైన కవరేజ్ అనేది మీరున్న ప్రాంతంలోని భూమి స్వరూపం (ఎత్తుపల్లాలు)పై ఆధారపడి ఉంటుంది.
అలాగే వాతావరణం, చుట్టుపక్కల ఉన్న భవనాలు/కట్టడాలు, సిగ్నల్ బలం, మీరు వాడుతున్న ఫోన్/డివైస్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లో చేసే మార్పులు లేదా అనుకోని సాంకేతిక అంతరాయాల వల్ల కూడా కవరేజ్ మారవచ్చు అని హెచ్చరిస్తున్నాయి.
* మరి BSNL సంగతేంటి?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇంకా ఇలాంటి ఆన్‌లైన్ కవరేజ్ మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతానికి, BSNL వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన లింక్ ఏదీ లేదు. ప్రధాన టెలికాం కంపెనీలలో ఈ ఫీచర్ లేనిది BSNL మాత్రమే.
* ఎయిర్‌టెల్ 'ఓపెన్ నెట్‌వర్క్' ప్రయత్నం
నిజానికి, ట్రాయ్ ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ విషయంలో కొంత పారదర్శకత చూపింది. 2015లో 'ప్రాజెక్ట్ లీప్' అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి, దానిలో భాగంగా 2016లో 'ఓపెన్ నెట్‌వర్క్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
దీని ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలోని టవర్లు ఎక్కడ ఉన్నాయి, సిగ్నల్ బలం ఎలా ఉంది, సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రదేశాలు (weak spots) ఏవి అని తెలుసుకోగలిగేవారు. అయితే, ప్రస్తుతం ట్రాయ్ ఆదేశాల మేరకు కొత్తగా పెట్టిన ఆన్‌లైన్ కవరేజ్ మ్యాప్ మాత్రం ఇంకా పూర్తిగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications








