9 నెలల తర్వాత రేపే భూమి మీదకు సునీతా విలియమ్స్.. రేపు ఏం జరగనుంది..?
అంతర్జాతీయ అంతరక్ష కేంద్రంలో (ISS) గత 9 నెలలుగు చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నాసా చేసింది. వీరిద్దరినీ తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక్‌ను ప్రయోగించారు. ఈ ఉదయం ISS నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ అన్‌డాకింగ్ పూర్తయింది. భూమివైపు ప్రయాణం ప్రారంభించింది.
ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే :
గత సంవత్సరం జూన్ 5 వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. స్టార్ లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2024 జూన్ 14 న భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ కారణంగా ప్రయాణం వాయిదా పడింది. అలా సుమారు 9 నెలల పాటు ISS లోనే గడపాల్సి వచ్చింది. వ్యోమగాములు లేకుండానే 2024 సెప్టెంబర్‌లో స్టార్‌లైనర్ భూమికి తిరిగి వచ్చింది.

రేపు ఉదయం భూమి మీదకు :
తాజాగా స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ సునీత, విల్మోర్తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి రేపు ఉదయం చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 2.41 గంటలకు చేపట్టనున్నారు.
ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్ :
స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ను భూ వాతావరణంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఇంజిన్ల ప్రజ్వలన చేస్తారు. ఫలితంగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3.27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో ల్యాండింగ్ కానున్నారు. అక్కడ నుంచి వారిని బయటకు తీసుకువస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాటు చేశారు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి :
ఈ ప్రక్రియను నాసా లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అయితే వాతావరణ పరిస్థితులను అనుసరించి ల్యాండింగ్ ప్రాంతంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నాసా అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది.
కీలక వైద్య పరీక్షలు :
సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాక.. వ్యోమగాములను జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకు వెళ్తారు. అనంతరం పూర్తి స్థాయిలో వారికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమి పైకి వచ్చాక.. సునీతా విలియమ్స్, విల్మోర్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో నిపుణులు అంచనా వేశారు.
సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవాల్సి రావడంతో ఇద్దరు వ్యామగాముల ఆరోగ్యం ప్రభావితం అయిందని గతంలోనే వార్తలు వచ్చాయి. నాసా విడుదల చేసిన ఫోటోల్లో కూడా భారీగా బరువు తగ్గినట్లు కనిపించారు. పోషకాహార లోపం కారణంగానే.. వారు బలహీనంగా కనిపిస్తున్నారని గతంలోనే వైద్యులు అంచనా వేశారు.
గతంలో వచ్చిన నాసా నివేదిక ప్రకారం.. వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లిన వెంటనే వారి శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుందని తెలిపింది. ఎర్రరక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగావిటీ లో శరీరం ఆక్సీజన్ అవసరాలను కుదించుకుంటుంది. ఫలితంగా అలసట వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపింది.
ఇలాంటి లక్షణాలు కారణంగానే వ్యోమగాములు భూమి మీదకు రాగానే.. కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమి మీద వారు పూర్తి స్థాయిలో సాధారణ జీవితం గడిపే వరకు వైద్యులు చర్యలు తీసుకుంటారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








