డీల్ రేట్లను పెంచే ఆలోచనలో సాప్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్
oi
-Staff
By Super
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ తమ డీల్ రేట్లను పెంచే యోచన చేస్తోంది. అమెరికా, యూరప్‌లతో సహా అన్ని ప్రాంతాలలో కుదుర్చుకునే ఒప్పందాలపై ఈ ధరల ప్రభావం ఉండవచ్చనే అభిప్రాయాన్ని టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ప్రస్తుత ధరలకు 2 నుంచి 3 శాతం పెరిగే వీలుందని సూత్రప్రాయంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా కుదిరిన ఒప్పందాలపై పెరిగిన ధరలతోనే అగ్రిమెంట్లు చేసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ఒప్పందాలు రెన్యువల్ అయ్యే క్రమంలో కొత్త ధరలను పెంచే యోచన ఉందన్నారు. కాగా విదేశాల్లో టీసీఎస్ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందని యూరోపియన్ రుణ సంక్షోభం, అమెరికా నిరుద్యోగ సమస్యల్లోనూ తమ పనితీరు ఎప్పటిలాగే కొనసాగుతోందని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ఆనందం వ్యక్తం చేశారు.
నిజానికి, యూరప్, యూఎస్‌లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, అయితే తమ సంస్థ కస్టమర్ల విషయంలో ఎలాంటి సమస్యలు రావనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం భారత ఐటీ రంగం యూరప్, యూఎస్‌ల నుంచే 80 శాతం ఆదాయాన్ని పొందుతోంది. ఈ క్రమంలో భారత్ ఐటీ రంగంలో అగ్ర స్థానంలో ఉన్న టీసీఎస్ వంటి సంస్థలు ధరల పెంపుకు దిగడం విదేశీ ఐటీ ఆర్డర్లపై ప్రభావం కనిపించే వీలు లేకపోలేదని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.