మొబైల్ యూజర్లకు మరో గట్టి షాక్.. మరోసారి రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు.. ఎప్పుడంటే?
Mobile Tariff Hike 2025 : దేశంలో టెలికాం సంస్థలు యూజర్లకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా భారీగా టారిఫ్ ఛార్జీలను పెంచాయి. సగటున ఏకంగా 11 నుంచి 23 శాతంగా రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి. అయితే ఈ సంవత్సరం కూడా మరోసారి టారిఫ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఇంత శాతం పెరగవచ్చు :
ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెట్ విశ్లేషకుల అంచనా ఆధారంగా ఈ సంవత్సరం చివర్లో టారిఫ్ పెంపు ను ప్రకటించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు (Telecom Operators) 10- 12 శాతం టారిఫ్ ల పెంపు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ పెంపు ప్రభావం బేస్ రీఛార్జ్ ప్లాన్‌లపై ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

దేశంలో టెలికాం యూజర్లు రికార్డు స్థాయిలో పెరగడం సహా 5G వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మే నెలలో దేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయింది. గత 29 నెలల్లో గరిష్ఠంగా 74 లక్షల మంది కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు.
108 కోట్లకు సబ్‌స్క్రైబర్లు :
దీంతో దేశవ్యాప్తంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. ఇందులో జియో లో 55 లక్షల మంది చేరారు. మరియు మరో సంస్థ ఎయిర్‌టెల్‌లో 13 లక్షల మంది చేరారు. దీంతో టారిఫ్‌ల పెంపు దిశగా టెలికాం సంస్థలు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. జెఫరీస్ సంస్థ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
బేస్ ప్లాన్‌లు కాకుండా! :
ఈ సంవత్సరం చివరి నాటికి సుమారుగా 10-12 శాతం పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బేస్ ప్లాన్‌లు కాకుండా ఇతర రీఛార్జ్‌లపై పెంపు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మరియు డేటా స్పీడ్, వినియోగం ఆధారంగా టారిఫ్‌ల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
గత సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు అనంతరం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థల నుంచి భారీగా యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. అనంతరం కొద్దికాలంలోనే చాలా మంది యూజర్లు ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు తిరిగొచ్చారు. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు భారీగా యూజర్లు తిరిగొచ్చారు.
వోడాఫోన్ ఐడియా కొంత కాలం పుంజుకున్నట్లు అనిపించినా.. BSNL తరహాలోనే భారీగా యూజర్లను కోల్పోతోంది. టారిఫ్‌ల పెంపు అనంతరం అధిక సంఖ్యలో యూజర్లు BSNL లోకి తిరిగొచ్చారు. అయితే అనంతరం కొన్ని నెలల్లోనే యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు.
ఈ సంవత్సరం చివర్లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం.. గత సంవత్సరంలోనే ఛార్జీలు పెంపు నిర్ణయం ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ సంవత్సరం ప్రైవేటు సంస్థల బాటలోనే నడుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications