మొబైల్ యూజర్లకు షాక్.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు..?
Recharge Plans Hike : టెలికాం యూజర్లు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇటీవల కాలంలో యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశ టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో (Jio) తొలి స్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vi), BSNL తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు.. రీఛార్జ్ ప్లాన్ లలో అనేక మార్పులు చేస్తున్నారు. చాలా సంస్థలు నెలవారీ కనిష్ఠ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించాయి.
త్వరలో యూజర్లకు షాక్! :
దీంతోపాటు కొన్ని సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ లో కీలక మార్పులు చేశాయి. అంటే వ్యాలిడిటీ, డేటాలో కోత విధించాయి. అయితే తాజాగా వస్తున్న లీక్స్ ఆధారంగా టెలికాం సంస్థలు త్వరలో యూజర్లకు షాక్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది. రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచనున్నాయని తెలుస్తోంది.

గతంలో 2024 మధ్యలో :
చివరిగా 2024 వ సంవత్సరం మధ్య భాగంలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ ప్లాన్ లను సవరించాయి. సగటును 15 శాతం వరకు ధరలను పెంచాయి. BSNL మాత్రం అప్పట్లో ధరను పెంచలేదు. అయితే ఇటీవల అనేక ప్లాన్‌ల ప్రయోజనాల్లో కోత విధించింది.
ప్రకటన ఎప్పుడు రానుంది? :
గత సంవత్సరం చివర్లోనే టెలికాం సంస్థలు మరోసారి రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న కొన్ని వివరాల ఆధారంగా జూన్ 2026 నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది.
సుమారు 15 -20 శాతం వరకు మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల పెంపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ARPU (వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం) పెంచుకోవడం సహా మరిన్ని కారణాలలో టారిఫ్‌ల పెంపు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
జెఫరిస్ తాజా నివేదిక ప్రకారం.. రీఛార్జ్ ధరల పెరుగుదలతో టెలికాం రంగం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జూన్ లో టారిఫ్‌ల పెంపు 15 శాతంగా ఉంటే, FY27 ఆర్థిక సంవత్సరంలో ARPU సుమారుగా 14 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు.
అయితే ధరల పెంపు అనంతరం కొత్త సబ్‌స్క్రైబర్లు తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలోనూ పెంపు అనంతరం కొన్ని నెలలపాటు ఆయా నెట్‌వర్క్‌ల నుంచి అనేక మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. అనంతరం కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది.
2024 సంవత్సరంలో మొబైల్ రీఛార్జ్ పెంపు సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ధరల పెంపుపై స్పష్టత ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం ధరల పెంపు నిర్ణయంపై ఎలా వ్యవహరిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ అనేక రీఛార్జ్ డేటా, వ్యాలిడిటీలో కోత విధించింది.


Click it and Unblock the Notifications








