మార్చి 2013 నాటికి 100కోట్లకు టెలికం యూజర్లు..?

Posted By: Super

 మార్చి 2013 నాటికి 100కోట్లకు టెలికం యూజర్లు..?

 

ముంబై: భారత్ టెలికం చందాదారుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వందకోట్లను దాటే అవకాశం ఉంది. ఆర్థిక విశ్లేషణ సంస్థ సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) తన తాజా నెలవారీ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. 1997లో మొబైల్ విప్లవం ప్రారంభమైన తరువాత, మొట్టమొదటిసారి ఆగస్టులో టెలికం చందాదారుల సంఖ్య 2.07 కోట్లు తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం, ఆగస్టులో చందాదారుల సంఖ్య 96.55 కోట్ల నుంచి 94.48 కోట్లకు జారింది. ఈ ప్రతికూలత నమోదైనప్పటికీ, 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టెలికం చందాదారుల సంఖ్య 104.2 కోట్లకు చేరుతుందని సీఎంఐఈ తాజాగా అంచనావేసింది.

ప్రాణ సంకటంగా మారుతున్న టెలికం టవర్లు:

వాషింగ్‌టన్‌: కమ్యూనికేషన్ వ్యవస్ధను మరింత బలోపేతం చెయ్యటంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పబడిన టెలికాం టవర్లు స్వేచ్ఛగా విహరించే పక్షులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ టవర్ల మూలంగా  ఏటా సుమారుగా 70 లక్షల విహాంగాలు మృత్యువాతపడుతున్నాయని అధయనకర్తలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడాల నుంచి మధ్య, దక్షిణ అమెరికాకు వలస వెళ్ళే పక్షులు వీటి బారిన పడుతున్నాయని పరిశోధకుల బృందం స్పష్టం చేసింది. ఈ పరిశోధనను సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని స్పేషియల్‌ సైన్సెస్‌ ఇన్సిట్యూట్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ట్రావిస్‌ లాంగ్‌కోర్‌ నేతృత్వం వహించారు. ఈ రెండు దేశాల్లో ఉన్న 84000 టెలికాం టవర్లలో కొన్ని 2000 అడుగుల ఎత్తును మించి ఉన్నాయి. అయితే పక్షులు ఈ టవర్లమీదుగా ఎగిరే సమయంలో వీటిలో చిక్కుకొని అవి చనిపోతుండటంతోపాటు, కొన్ని నిర్మాణాలను నిలబడేలా చేసే సన్నని తీగల వల్ల కూడా పక్షులు మృత్యువాత పడుతున్నాయని ట్రావిస్‌ తెలిపారు. పొడవైన టవర్లు పక్షులకు ప్రాణసంకటంగా పరిణమించాయని లాంగ్‌కోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot