మీకు ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా.. అయితే Chakshu పోర్టల్ గురించి తెలుసా?
మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సంచార్ సాతీ ప్రాజెక్టులో భాగంగా చక్షు (Chakshu Portal) పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమకు ఎదురైన మోసపూరిత కాల్స్, తప్పుడు లాటరీ సహా ఇతర ఉద్యోగ సమాచారానికి సంబంధించిన మెసెజ్‌లపై రిపోర్టు చేయవచ్చు.
చక్షు పోర్టల్ : దీంతోపాటు చక్షు పోర్టల్ ద్వారా ఫోన్ నంబర్ లీక్‌ల వంటి సమస్యలపైనా రిపోర్టు చేయవచ్చు. టెలికమ్యూనికేషన్ రంగంలో విజిలెన్స్ మరియు మరింత పారదర్శకత కోసం ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు కేంద్ర ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఎలాంటి ఫిర్యాదులు నమోదుచేయవచ్చంటే : ఈ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కేంద్ర మంత్రి (Union Minister Ashwini Vaishnaw) వివరించారు. బ్యాంకు, పేమెంట్లు, సిమ్ కార్డులు, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, కేవైసీ అప్‌డేట్లపై అనుమానిత కాల్స్, మెసేజ్ లేదా ఇతర వాట్సాప్ మెసేజ్‌లపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
కోటి మొబైల్ నంబర్లను డియాక్టివేట్ : ఫోన్ నంబర్ లీక్‌లపైనా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ పోర్టల్ ద్వారా ఈ సమస్యలపైనా ఫిర్యాదు చేయవచ్చని, దర్యాప్తు చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత 9 నెలల్లో మోసపూరిత వ్యవహారాలతో సంబంధం ఉన్న సుమారు కోటి మొబైల్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు వెల్లడించారు.

డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం : బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు టెలికాం శాఖ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌పాంను (Digital Intelligence platform) ప్రవేశపెట్టింది. ఈ తరహా మోసాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు మరియు కీలక సమాచారాన్ని సంబంధిత వర్గాలు పరస్పరం పంచుకొనే విధంగా ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం పనిచేస్తుంది.
సెక్యూర్ ఇండియా : సెక్యూర్ ఇండియా ప్రాజెక్టులో (Secure India) భాగంగా సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పరంగా జాతీయ, సంస్థాగత, వ్యక్తిగత స్థాయిలో అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశ ప్రజలు తమ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకోవాలని కోరారు.
సైబర్ దాడులు సహా ఇతర భద్రతా ముప్పును ఎదుర్కొనేందుకు : మోసపూరిత దాడులను విజయవంతంగా ఎదుర్కోవడంలో సంచార్ సాథీ పోర్టల్ (sanchar saathi) కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. తాజాగా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం, చక్షు పోర్టల్‌లు సైబర్ దాడులు సహా ఇతర భద్రత ముప్పును ఎదుర్కొనే సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని చెప్పారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








