సొంత రాకెట్ పేలిపోయినా ఇస్రోను అభినందించిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఈ పేరు కొన్ని వింతలు, మరికొన్ని విజయాలకు కేరాఫ్, ఏదో ఒక వార్తతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు.ట్విటర్ కొనుగోలు అనంతరం తీసుకొచ్చిన మార్పులు, సంస్థ ఉద్యోగుల తొలగింపు అంశాల్లో విమర్శలు సైతం ఎదుర్కోన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న మస్క్.. వైఫల్యాలను కూడా ఎంత హూందాగా స్వీకరిస్తారో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది.
ఎలాన్ మస్క్ ISRO (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు అభినందనలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇస్రో తన PSLV- C55 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) విజయవంతంగా ప్రయోగించి కక్ష్యలోకి పంపింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మస్క్.. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈనెల 20 మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్.. ప్రయోగించిన కొద్ది నిమిషాలకే పేలిపోయింది.

ఇస్రో గత శనివారం ప్రయోగించిన PSLV - C55 రాకెట్ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద ప్రయోగం. 228 టన్నుల PSLV 57వ సారి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ ప్రభుత్వానికి చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల బరువుగల లుమోలైట్-4 అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. టెలీయోస్- 2 సింథటిక్ అపెర్చర్ రాడార్ పెలోడ్‌ను కలిగి ఉంది.
టెలియోస్-2 ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాత్రి, పగలు కవరేజీ ఇవ్వగలదు. ఒక మీటరు రెజల్యూషన్‌తో క్వాలిటీ చిత్రాలను పంపగలదు. ఇక లూమాలైట్-4 సింగపూర్ ఇ నామిగేషన్, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చేలా వివరాలను ఇవ్వనుంది.
అదే విధంగా గత గురువారం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగించిన కాసేపటికే పేలిపోయింది. ఈ రాకెట్‌లో మొత్తం 33 ఇంజిన్లు ఉండగా.. ఫస్ట్ స్టేజ్ పూర్తయ్యాక 3 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి బూస్టర్లు విడిపోయేలా ప్లాన్ చేశారు. కానీ అది సక్రమంగా జరగలేదు. అస్తవ్యస్తంగా ఆకాశంలో ప్రయాణించింది. దీంతో ప్రయోగించిన నాలుగు నిమిషాలకే ఈ భారీ రాకెట్ పేలిపోయింది.
చంద్రునిపైకి మనుషులు, వస్తువులను పంపేందుకు స్టార్‌షిప్‌ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. 2029 నాటికి మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు, అక్కడ వారు నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. కానీ ప్రయోగం విఫలం అయింది. ఈ ప్రయోగం తర్వాత అంగారకుడుపైకి మరో రాకెట్ ప్రయోగించాలని స్పే్స్ ఎక్స్ ప్లాన్ చేసింది.
33 ఇంజిన్లు, 400 అడుగుల స్పేస్ ఎక్స్‌కు చెందిన భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగం విఫలం కావడంపై ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఏమాత్రం ఉత్సాహం కోల్పోలేదు. తాము చేపట్టిన ప్రయోగం అద్భుతమని, దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. కొన్ని నెలల్లో చేపట్టబోయే ప్రయోగం కోసం ఈ అనుభవాన్ని వినియోగించుకుంటామని చెప్పారు.


Click it and Unblock the Notifications