‘టిసిఎస్ స్టోరీ.. అండ్ బియాండ్’: రామదొరై

Posted By: Staff

‘టిసిఎస్ స్టోరీ.. అండ్ బియాండ్’: రామదొరై

టీసీఎస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవీవిరమణ పొందిన రామదొరై రాసిన ‘టీసీఎస్ స్టోరీ.. అండ్ బియాండ్’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ మాట్లాడుతూ జీవితంలో తమదైన ముద్రవేసేలా బతకాలని, నమ్మిన సిద్ధాంతం కోసం ధైర్యంగా ముందుకు సాగడమే కాకుండా, చేసే పనికి పూర్తిస్థాయి న్యాయం చేకూర్చాలని, ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ దానిని మన సొంత పనిగా భావించాలని అన్నారు.

మోడరన్‌ ఇండియాలో ఐటి కంపెనీలకు టిసిఎస్‌ మార్గదర్శిగా అభివర్ణించిన ఆయన, గడచిన పద్నాలుగు సంవత్సరాల కాలంలో టిసిఎస్‌ ఎలా ఒక్కో మెట్టూ పైకెదిగి ప్రపంచ టాప్‌ 10 ఐటి కంపెనీల్లో ఒకటిగా నిలిచిందన్న విషయాన్ని రామదొరై చక్కగా వివరించారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఐటి కంపెనీల ఔట్‌సోర్సింగ్‌ ఖర్చులు తగ్గుతుండడం భారత్‌లోని చిన్న కంపెనీలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డ ఆయన పరిస్థితులు సద్దుమణిగితే వేగవంతమైన వృద్ధి భారత్‌కే సొంతమని వివరించారు.

టిసిఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 2009లో పదవీ విరమణ చేసిన రామదొరై ప్రసంగిస్తూ, సంస్థను 2010 నాటికి టాప్‌కు చేర్చాలని 2003లో నిర్ణయించామని, ఒక సంవత్సరం ముందే ఆ ఘనతను అందుకున్నామని గుర్తు చేశారు. 42 దేశాల్లో 1.6 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని దగ్గర చేసిన సంస్థ వార్షికాదాయం 6 బిలియన్‌ డాలర్లను దాటిందని ఆయన తెలిపారు. కాగా, ఈ పుస్తకంపై టాటా సన్స్‌ చైర్మన్‌ రతన్‌టాటా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, టిసిఎస్‌ ప్రయాణంలో రామ్‌ ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. పెంగ్వీన్‌ బుక్స్‌ ద్వారా ఇండియాలో విడుదలవుతున్న ఈ పుస్తకం ఖరీదు 699 రూపాయలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting