ట్రాయ్‌ కొత్త చైర్మన్‌గా రాహుల్‌ ఖుల్లార్‌, ముందరన్నీ సవాళ్లే!

Posted By: Prashanth

ట్రాయ్‌ కొత్త చైర్మన్‌గా రాహుల్‌ ఖుల్లార్‌, ముందరన్నీ సవాళ్లే!

 

న్యూఢిల్లీ : వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రాహుల్‌ ఖుల్లార్‌ను టెలికం నియంత్రణసంస్థ (ట్రాయ్‌) చైర్మన్‌గా నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఖుల్లార్‌ 1975 బ్యాచ్‌ ఢిల్లీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం జె ఎస్‌ శర్మ పదవీ కాలం ఆదివారంతో ముగియ నుండటంతో ఆయన స్థానంలో ఖుల్లార్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ వేలానికి బేస్‌ రేటు పెద్ద ఎత్తున పెంచడంతో టెలికం రంగానికి చెందిన ఆపరేటర్లు ఆగ్రహంతోఉన్న ఈ సమయంలో ఖుల్లార్‌ కీలక పదవిని చేపడుతున్నారు. ట్రాయ్‌ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్న ఖుల్లార్‌ ముందు పెద్ద సవాళ్లున్నాయి. ఇప్పటికే టెలికం పరిశ్రమలో పలు చీలికలున్నాయి.

సెగపుట్టిస్తున్న ‘2జీ’!

దేశ చరిత్రలోనే భారీ కుంభకోణంగా వెలుగులోకివచ్చిన 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో రద్దు అయిన లైసెన్సులకు కనీస ధరను టెలికాం నియంత్రిత వ్యవస్థ ట్రాయ్ నిర్ణయించింది. 2008లో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి టెలికాం మంత్రి రాజా హయాంలో మంజూరైన 122 లైసెన్సులను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్‌కు ప్రారంభ(బేస్) వేలం ధరను రూ.3,622.18 కోట్లుగా ట్రాయ్ ప్రతిపాదించింది. అంటే వేలంలో పాల్గొనే సంస్థలు ఈ రేటుకు దిగువగా ఉన్న ధరతో ధరఖాస్తు చేసే వీలు లేదన్నమాట.

2008లో జరిగిన వేలంతో సరిచూస్తే అప్పటి కనీస ధరకు ఇది పదింతలు అధికం కావడం గమనార్హం. కాగా, సిడిఎమ్‌ఎ వినియోగదారులకు అవసరమైన 800 మెగాహెడ్జ్ తరంగాలకు, జిఎస్‌ఎమ్ వినియోగదారులకు అవసరమైన 900 మెగాహెడ్జ్ తరంగాలకు బేస్ ధరలను సూచించిన ట్రాయ్..వీటి ధర కంటే రెండింతలు అధిక ధరను 1800 మెగాహెడ్జ్ తరంగాల వేలానికి నిర్ణయించింది. అంతేగాక వేలంలో పాల్గొనాలనుకున్న టెలికాం ఆపరేటర్లకు కొన్ని నిర్ధిష్టమైన పరిమితులనూ విధించింది. మరోవైపు ట్రాయ్ నిర్ణయంపై టెలికాం ఆపరేటరుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ తాజా సిఫారసుల నేపధ్యంలో మున్ముందు మొబైల్ చార్జీలు పెరగొచ్చనే ఆందోళనలు జోరందుకుంటున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting