'ఐఫోన్‌లను భారత్ సహా ఇతర దేశాల్లో తయారుచేసి అమెరికాలో విక్రయిస్తే 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే'
గతంలో పోలిస్తే భారత్‌లో ఐఫోన్‌ల తయారీ గణనీయంగా వృద్ధి చెందింది. ఐఫోన్‌ల ఉత్పత్తిని మరింతగా పెంచుతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇప్పటికే వెల్లడించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో మెజార్టీ హ్యాండ్‌సెట్‌లు భారత్‌లో తయారుచేసినవే ఉంటాయని ఇటీవల చెప్పారు. ఇటీవల అమెరికా, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలు కూడా ఆపిల్‌ను (Apple) భారత్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. అయితే ఆ రెండు దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొంత కాలం వాయిదా పడింది.
భారత్ ప్లాంట్‌లలో ఐఫోన్‌ల (iPhones) ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఒక వైపు అడుగులు పడుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని పెంచేందుకు ఆపిల్ ప్రయత్నం చేస్తోందని, అది తనకు ఇష్టం లేదని టిమ్ కుక్ తో చెప్పినట్లు ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోనే ఐఫోన్‌లను తయారీ చేయాలని టిమ్ కుక్ తో చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇందుకు అంగీకరించినట్లు కూడా తెలిపారు. ఈ వ్యాఖ్యల అనంతరం భారత్‌లో ఆపిల్ పెట్టుబడులు కొనసాగుతాయని, ఇందులో ఎటువంటి మార్పులు రాబోవని.. ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
మళ్లీ తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లు.. స్థానికంగానే తయారు చేయాలని స్పష్టం చేశారు. భారత్ సహా ఇతర ఏ దేశంలో తయారు చేసినా 25 శాతం టారిఫ్‌లు చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికాలో విక్రయమయ్యే ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్, మ్యాక్ ఎక్కువ శాతం వియత్నాంలో తయారు చేస్తున్నట్లు ఇటీవలే సంస్థ తెలిపింది.
అమెరికాలో విక్రయించే ఐఫోన్లు.. అమెరికాలోనే తయారు చేయాలని ఆపిల్‌కు చెప్పినట్లుగానే.. శాంసంగ్ టార్గెట్‌గా (Samsung) అలాంటి ప్రకటన ట్రంప్ చేశారు. విదేశాల్లో తయారైన ఫోన్‌లపై 25 శాతం టారిఫ్ తప్పదని స్పష్టం చేశారు. శాంసంగ్ గానీ మరే సంస్థ గానీ.. స్థానికంగానే తయారీ చేస్తే టారిఫ్‌లు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.
* భారత్ సహా విదేశాల్లో తయారు చేసిన ఐఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లపై ట్రంప్ టారిఫ్‌లు విధించినా.. అమెరికాలో ఉత్పత్తి చేసిన ఖర్చు కంటే తక్కువే కానుందని తెలుస్తోంది. భారత్‌లో ఉత్పత్తి చేస్తే.. తయారీ ఖర్చులు సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కారణమని తెలుస్తోంది. అమెరికాలో వేతనాలు సహా ఇతర కారణాలతో తయారీ వ్యయం అధికంగా ఉంటుందని తెలుస్తోంది.
* ఐఫోన్ తర్వాత సిరీస్ ధరలు పెరిగే అవకాశం ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. డిజైన్ అప్‌డేట్స్, కొత్త ఫీచర్‌ల కారణంగా భవిష్యత్‌లో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ధరల పెంపు ఏ సిరీస్‌ల నుంచి ప్రారంభం కానుందో వెల్లడించలేదు.
ప్రస్తుతానికి చైనాలో అధిక శాతం ఐఫోన్‌లు తయారవుతున్నాయి. భారత్‌లోనూ భారీ స్థాయిలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ ప్లాంట్స్‌లో ఐఫోన్‌లు తయారీ అవుతున్నాయి. మొత్తంగా 15 శాతం ఐఫోన్‌ల ఉత్పత్తి భారత్‌లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications








