రూ.4 రీచార్జ్‌తో నెలంతా పండగ చేసుకోండి!

Posted By: Prashanth

రూ.4 రీచార్జ్‌తో నెలంతా పండగ చేసుకోండి!

 

హైదరాబాద్: మొబైల్ సర్వీసుల రంగంలోని యునినార్ కంపెనీ సబ్‌సే సస్తా ఉద్యమం ద్వారా అతి తక్కువ ధరకే మొబైల్ సర్వీసులు అందించేందుకు కంకణం కట్టుకుంది. ఈ ప్రచారోద్యమంలో భాగంగా తక్కువ ధరకే రీచార్జ్ వోచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఎండీ సిగ్వే బ్రెకీ తెలిపారు. తాము కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు రూపాయిల స్పెషల్ రిచార్జ్ వోచర్‌తో 30 రోజుల పాటు యునినార్ నుంచి ఏ యునినార్ నంబరుకైనా రాత్రి వేళల్లో ఎడతెరిపిలేకుండా మాట్లాడుకోవచ్చని, పగటి పూట మాత్రం రెండు సెకన్లకు ఒక పైసా చొప్పున కాల్ చార్జి ఉంటుందని బ్రెకీ తెలిపారు.

అలాగే 111 రూపాయల రీచార్జ్ వోచర్‌తో 30 రోజుల పాటు యునినార్ నుంచి ఏ యునినార్ నంబర్‌కైనా ఎలాంటి పరిమితి లేకుండా కాల్స్ చేసుకోవచ్చన్నారు. ఇవి కాకుండా 29, 52, 25, 65 రీచార్జ్ వోచర్లు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సబ్‌సే సస్తా ఉద్యమంతో తాము ఏ ఇతర ఆపరేటర్‌తో పోల్చినా 28 శాతం తక్కువ ధరకే లోకల్ కాల్స్ అందుబాటులో ఉంచిన ఏకైక ఆపరేటర్‌గా అవతరిస్తున్నామని ఆయన అన్నారు.

దీని వల్ల యునినార్ కస్టమర్లందరూ కలిసికట్టుగా నెలకు 12 కోట్ల రూపాయలు పొదుపు చేసుకోగలుగుతారని, రాష్ట్రంలోని మొబైల్ చందాదారులందరూ యునినార్‌కు మారినట్టయితే వారి పొదుపు నెలకు 270 కోట్ల రూపాయలుంటుందని సిగ్వె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమకు 37 లక్షల మంది కస్టమర్లున్నారని సిగ్వే వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot